ఈటల ఖమ్మం వెళ్ళిన్నట్లు నాకు తెలీదు: బండి

May 04, 2023


img

తెలంగాణ బిజెపిలో చేరికల కమిటీ ఛైర్మన్ హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇద్దరూ కలిసి ఈరోజు ఖమ్మం బయలుదేరి వెళ్ళారు. బిఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపిలో చేరవలసిందిగా ఆహ్వానించేందుకు వారు ఖమ్మం వెళ్ళారు. అయితే వారు ఖమ్మం వెళ్ళిన్నట్లు తనకు తెలియదని, తాను టీవీ వార్తల్లో చూసి ఈవిషయం తెలుసుకొన్నానని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పడం విశేషం. 

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు విలేఖరులు వారి ఖమ్మం పర్యటన గురించి అడిగినప్పుడు బండి సంజయ్‌ ఈవిదంగా సమాధానం చెప్పారు. అయితే పోలీసులు తన ఫోన్‌ గుంజుకొన్నందున తన వద్ద ఫోన్‌ లేకపోవడంతో వారు ఈ విషయం తనకి చెప్పలేకపోయి ఉండవచ్చని, కానీ మంచి ప్రజాబలం ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపిలోకి ఆహ్వానించేందుకు వారు వెళుతుండటం చాలా మంచిపని అని బండి సంజయ్‌ అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో వారు చర్చించిన తర్వాత ఏ విషయమూ ఎలాగూ తెలియజేస్తారని బండి సంజయ్‌ అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి మంచి సమర్ధుడైన నాయకులు బిజెపిలోకి రావాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు. 

అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపిలో ఆహ్వానించేందుకు తామిద్దరం ఖమ్మం వెళుతున్నట్లు బండి సంజయ్‌కి ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు చెప్పకపోవడం గమనిస్తే బండి సంజయ్‌కీ వారికీ మద్య విభేధాలు ఉన్నట్లు అర్దమవుతుంది. కానీ తన వద్ద ఫోన్‌ లేకపోవడం వలన వారు చెప్పలేకపోయారని బండి సంజయ్‌ సమర్ధించుకొన్నారు. 



Related Post