తెలంగాణ ప్రభుత్వం- గవర్నర్‌ మరో యుద్ధానికి సై!

May 02, 2023


img

తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మద్య ఎప్పటికప్పుడు ఏదో ఓ అంశంపై మాటల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నగరంలో డా.అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు తనను ప్రభుత్వం ఆహ్వానించలేదని, ఆహ్వానించి ఉంటే తప్పకుండా హాజరయ్యేదానినని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. 

కనుక ఆ తర్వాత డా.అంబేడ్కర్‌ పేరు పెట్టుకొన్న తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ తమిళిసైని ఆహ్వానించి ఉండకపోవచ్చు. అయితే ఆమెను ఆహ్వానించారా లేదా అనే విషయం తెలుసుకోకుండా మంత్రి జగదీష్ రెడ్డి, ఆమెపై విరుచుకు పడ్డారు. 

రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, గవర్నర్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాకుండా తాను కూడా వాటిలో ఒకరినని నిరూపించుకొన్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. అయితే గవర్నర్‌ వచ్చినా రాకపోయినా సచివాలయం ప్రారంభోత్సవం ఆగిపోలేదని, ఆమె ఈ కార్యక్రమానికి హాజరై ఉంటే గౌరవంగా ఉండేదని కానీ రాకుండా తన నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకొన్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. 

మంత్రి విమర్శలపై రాజ్‌భవన్‌ వెంటనే స్పందిస్తూ, “తెలంగాణ ప్రభుత్వం నుంచి గవర్నర్‌కు ఎటువంటి ఆహ్వానమూ రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తప్పకుండ హాజరయ్యేవారు,” అంటూ ప్రెస్‌నోట్‌ విడుదల చేయడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సంజాయిషీ చెప్పుకోవలసివస్తోంది. 


Related Post