కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దక్షిణాది రాష్ట్రాలలోనే కాదు... రష్యా, జపాన్ వంటి విదేశాలలో సైతం అభిమానులున్నారు. ఆయన తమిళనాడులో ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనుకొన్నప్పటికీ తాను వాటిలో ఇమడలేనని గ్రహించి వాటికీ, వివాదాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకొంటున్నారు. అటువంటి వ్యక్తిని ఏపీలో టిడిపి, వైసీపీలు తమ రాజకీయాల కోసం బలిపశువుని చేశాయి.
ఎన్టీఆర్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడులతో ఉన్న స్నేహాన్ని పురస్కరించుకొని ఆయన టిడిపి ఆహ్వానం మేరకు ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ నటన గురించి, బాలకృష్ణ స్టైల్ గురించి, చంద్రబాబు నాయుడు దూరదృష్టి గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పి వెళ్ళిపోయారు. అంతే! ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, ఆయన ప్రభుత్వం గురించి గానీ రజనీకాంత్ ఎటువంటి విమర్శలు చేయలేదు.
కానీ ఆయన చంద్రబాబు నాయుడుని పొగిడినందుకు ఏపీలో మంత్రులందరూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాక్షాత్ రాష్ట్రపతి, ప్రధానమంత్రుల చేత గౌరవించబడే రజనీకాంత్‌ను పట్టుకొని నోటికి వచ్చిన్నట్లు అవహేళన చేస్తూ మాట్లాడారు. చివరికి సినీ పరిశ్రమలో ఉన్న పోసాని కృష్ణ మురళి కూడా రజనీకాంత్ గురించి అనుచితంగా మాట్లాడారు. ఏపీ మంత్రుల తీరుపై రజనీకాంత్ స్పందించలేదు కానీ ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇందుకు చంద్రబాబు నాయుడుని కూడా వేలెత్తిచూపక తప్పదు. రజనీకాంత్‌ని ఆహ్వానిస్తే ఆయన తప్పకుండా తన గురించి నాలుగు మంచి ముక్కలు చెపుతారని తెలుసు. తనకు ఎవరు మద్దతు పలికినా వారిపై వైసీపీ నేతలు విరుచుకు పడతారని కూడా చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. అయినప్పటికీ ఆయన రజనీకాంత్‌ను ఏపీకి రప్పించి టిడిపి-వైసీపీ రాజకీయాలకు బలిపశువుని చేశారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని పిలిచి పొగిడించుకొని ఈవిదంగా అవమానించి పంపించడం ఎంత దారుణం? ఇందుకు చంద్రబాబు నాయుడుని నిందించాలా లేక చిన్నా పెద్దా గౌరవం లేకుండా నోరుపారేసుకొనే ఏపీ మంత్రులను అనాలా?