నితీశ్, మమతతో కేసీఆర్‌ చేయి కలుపుతారా?

April 29, 2023


img

దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నిటినీ కూడగట్టి వచ్చే ఎన్నికలలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకొన్నారు సిఎం కేసీఆర్‌. అయితే ఆయన కలిసిన ప్రాంతీయ పార్టీల నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కలుపుకుపోవాలని సూచించడం, దానితోనే ముందుకు సాగాలనుకోవడంతో కేసీఆర్‌ విపక్ష కూటమి ఆలోచనలు మానుకొని టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చుకొని ఒంటరి ప్రయాణం మొదలుపెట్టారు. 

ఇటువంటి సమయంలో బిహార్‌, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్‌, మమతా బెనర్జీ ఇద్దరూ భేటీ అయ్యి దేశంలో బిజెపియేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలని నిర్ణయించుకొన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా మే నెలాఖరులోగా పాట్నాలో నితీశ్ కుమార్‌ కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలోని బిజెపియేతర పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో పాల్గొనవలసిందిగా కేసీఆర్‌ను కూడా ఆహ్వానించనున్నారు. 

కానీ కేసీఆర్‌ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా లేరు. రెండోది తన నాయకత్వాన్ని, ఆలోచనలను అంగీకరించేవారితోనే ముందుకు సాగుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తాను ప్రధానమంత్రి కావాలనుకొంటున్నారు. అప్పుడే తన ఆలోచనలను అమలుచేయగలుగుతారు కనుక ఒంటరిగా ముందుకు సాగుతున్నారు. ఒకవేళ ఈ కూటమిలో చేరితే వారి నాయకత్వాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. వారితో సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఇది కేసీఆర్‌కు సరిపడేది కాదు కనుక పాట్నాలో జరిగే ఈ సమావేశానికి కేసీఆర్‌ హాజరవకపోవచ్చు.


Related Post