కేసీఆర్‌ దూరదృష్టి వలనే ఇంతవేగంగా సచివాలయం పూర్తి: వేముల

April 28, 2023


img

ఈ నెల 30న నూతన సచివాలయం ప్రారంభోత్సవం కాబోతుండటంతో రాష్ట్ర రహదారులు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దాని నిర్మాణానికి సంబందించి ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకొన్నారు. 

సచివాలయం శంఖుస్థాపన పనులు మొదలుపెట్టే సమయానికే సిఎం కేసీఆర్‌కు అది ఏవిదంగా ఉండబోతోందో, దాని నిర్మాణపనులు ఆలస్యం కాకుండా ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలో చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం సివిల్ ఇంజనీరింగ్ చేసి, నిర్మాణ రంగంలో ఉన్న నాకే చాలా ఆశ్చర్యం కలిగించింది. పునాదులు పడకమునుపే సచివాలయంలో అమర్చాల్సిన సెంట్రల్ ఏసీ సిస్టమ్ మొదలుకొని లైటింగ్ సిస్టమ్, ఫర్నీచర్ ఇలా ప్రతీదాని గురించి సిఎం కేసీఆర్‌ ముందుగానే మాట్లాడటం చూసి మొదట నేను తేలికగా తీసుకొన్నాను. వాటి తయారీ, సరఫరా, సచివాలయం సిద్దమైన తర్వాత వాటన్నిటినీ దానిలో ఏర్పాటు చేయడం కోసం  ముందుగానే సంబందిత సంస్థలతో మాట్లాడాలని కేసీఆర్‌ చెప్పినప్పుడు అప్పుడే తొందరదేమిటి? అని అనుకున్నాను. 

కానీ కేసీఆర్‌ గట్టిగా చెప్పిన తర్వాత సదరు సంస్థల మాట్లాడిన తర్వాతే వాటి ఉత్పత్తి, తయారీ,సరఫరా, కమీషనింగ్‌కు 6-12 నెలల సమయం పడుతుందని అర్దమైంది. ఒకవేళ సచివాలయం నిర్మాణ పనులు కొలిక్కి వస్తున్నప్పుడు వాటి కోసం అప్పుడు ఆర్డర్ పెట్టి ఉంటే మరో ఏడాది తర్వాతే సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్దమై ఉండేది. కానీ కేసీఆర్‌ దూరదృష్టితో చేసిన సూచనలు మేమందరం అంతే ఖచ్చితంగా ఫాలో అవుతూ ముందుకు సాగడం వలన మద్యలో కరోనా కారణంగా ఓ ఆర్నెల్లు పనులు నిలిచిపోయినప్పటికీ రెండున్నరేళ్ళలోనే ఇంత అద్భుతమైన కట్టడాన్ని పూర్తిచేయగలిగాము,” అని మంత్రి వేముల చెప్పారు.

“కొత్త సచివాలయంలో ప్రతీ శాఖకు ఒకటి చొప్పున మొత్తం 35 సమావేశ మందిరాలను నిర్మించాము. సచివాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక డిజిటల్ కంప్యూటింగ్ వ్యవస్థ, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి సౌకర్యాలతో సచివాలయంలోని ఉన్నతాధికారులు రాష్ట్రంలో ఏ జిల్లాలో అధికారులతో అయినా సమావేశాలు నిర్వహించుకోవచ్చునని, అదే విదంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు కూడా సచివాలయంతో ఎప్పుడైనా కనెక్ట్ అవ్వొచ్చు. అందుకే జిల్లా కేంద్రాలలో కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు నిర్మించాము. కేసీఆర్‌ ఎంత దూరదృష్టితో ఆలోచిస్తారో గ్రహించేందుకు ఇవే నిదర్శనం, “అని మంత్రి వేముల చెప్పారు. 

కొత్త సచివాలయం నిర్మాణం కోసం రూ.617 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, ఫర్నీచర్, గార్డెనింగ్ కోసం మరికొంత అదనంగా ఖర్చయిందని చెప్పారు. అయితే మరో వందేళ్ళు వరకు చెక్కుచెదరని విదంగా తెలంగాణ ప్రజలందరూ గర్వపడేలా ఈ సచివాలయం నిలుస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. 

 



Related Post