ఏపీలో మళ్ళీ రాయల తెలంగాణ లొల్లి!

April 25, 2023


img

ఏపీలో అభివృద్ధి లేకపోయినా 365 రోజులు రాజకీయాలు సాగుతూనే ఉంటాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిలు వాటి మద్య బిజెపి,  జనసేనలు నాలుగు స్థంభాలాటలు ఆడుకొంటూ కాలక్షేపం చేసేస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేసేస్తుంటే, మిగిలిన పార్టీలు అమరావతి పేరుతో కాలక్షేపం చేస్తున్నాయి. ఈ అంశం మీద ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు అన్ని పార్టీలు రాజకీయ చదరంగం ఆడుకొంటుంటాయి. వాటిలో అవి ఎన్ని ఆటలు ఆడుకొన్నా పర్వాలేదు కానీ మద్యలో తెలంగాణను కూడా లాగేందుకు ప్రయత్నించడమే అభ్యంతరకరం. 

రాయలసీమకు చెందిన పలువురు రాజకీయ నాయకులు రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్వర్యంలో సోమవారం కర్నూలులో  సమావేశమయ్యి రాయలసీమ జిల్లాల వెనకబాటుతనం గురించి మాట్లాడారు. కర్నాటకలో నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఎడారిలా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రాన్ని, ఆ తర్వాత ఏపీని పాలిస్తున్నవారు రాయలసీమకే చెందినవారైనప్పటికీ రాయలసీమ జిల్లాలు వెంకబడిపోయే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

వారిలో టిడిపికి చెందిన జేసీ దివాకర్ రెడ్డి వంటివారు రాయలసీమలోని నాలుగు జిల్లాలను తెలంగాణలో విలీనం చేసి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 

ఈ రాయల తెలంగాణ ప్రతిపాదనపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ, “తెలంగాణ ఏర్పడక మునుపే ఈ డిమాండ్‌ వినిపించింది. కానీ దీనిని తెలంగాణ ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించారు. కనుక ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు. కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందింది కనుకనే చుట్టుపక్కల రాష్ట్రాలలో సరిహద్దు జిల్లాల నుంచి ఇటువంటి డిమాండ్లు వినబడుతున్నాయి. అయితే వెనకబాటుతనానికి విలీనం పరిష్కారం కాదు. ఆయా రాష్ట్రాలలో పాలకులకు కేసీఆర్‌లాగా దూరదృష్టి, చిత్తశుద్ధి లేకపోవడమే! కనుక సరైన పాలకులను ప్రజలు ఎన్నుకొంటే ఏ రాష్ట్రమైనా తెలంగాణ రాష్ట్రంలాగ తప్పక అభివృద్ధి చెందుతుంది,” అని అన్నారు. నిజమే కదా!


Related Post