తెలంగాణలో బిజెపికి ఎన్నికల ట్యాగ్‌లైన్... కలర్ మారిందే!

April 25, 2023


img

ఈ ఏడాది చివరిలోగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున అప్పుడే బిఆర్ఎస్, బిజెపి,కాంగ్రెస్ పార్టీలలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బిజెపి తహతహలాడుతోంది. కనుక బిజెపి ఎన్నికల కోసం ఓ ట్యాగ్‌లైన్ (నినాదం)తో ఓ పోస్టర్‌ సిద్దం చేసింది. 

దానిలో పైన “మరోసారి మోడీ సర్కార్” అని కిందన “తెలంగాణలో ఈసారి బిజెపి ప్రభుత్వం,” అనే నినాదాలున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎప్పుడూ కాషాయరంగులో కనిపించే కమలం ఈ తాజా పోస్టర్‌లో తెలుపు బ్యాక్ గ్రౌండ్‌లో నలుపు రంగులో కనిపించడం, దానికి ఇరువైపులా దళితుల పోరాటాలను సూచించే నీలం రంగుని జోడించడం!

సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించి ఈసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు చక్రం తిప్పబోతున్నారు. అదే విషయం పదేపదే చెపుతున్నారు కూడా. కనుక కేంద్రంలో మోడీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రాబోతోందని దీని ద్వారా తెలంగాణ ప్రజలకు బిజెపి బలమైన సందేశం ఇస్తున్నట్లు భావించవచ్చు.  

సిఎం కేసీఆర్‌ డా.అంబేడ్కర్‌ పేరుతో, దళితబంధు తదితర పధకాలతో దేశంలో బడుగు బలహీనవర్గాల ప్రజలను, ముఖ్యంగా దళిత ఓటర్లను ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నిస్తుండటంతో బిజెపి కూడా అప్రమత్తమైన్నట్లుంది. అందుకే కాషాయ రంగుకు బదులు ఈసారి తెలుపు,నీలి రంగులతో ఆ వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లుంది. అయితే నినాదాలు, బ్యానర్లతో తాత్కాలికంగా ప్రజలను ఆకట్టుకోవచ్చు కానీ వాటితో ఓట్లు పడవు. ఇప్పుడు అభివృద్ధే ఏ పార్టీకైనా గీటురాయి. ఆ దిశలో చేసే ప్రయత్నాలు, ఆలోచనలే ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని కేసీఆర్‌ ఇప్పటికే రెండుసార్లు నిరూపించారు కదా?


Related Post