మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు: విజయమ్మ

April 25, 2023


img

పోలీసులపై దాడి చేసినందుకు 14 రోజులు చంచల్‌గూడ జైలులో జ్యూడీషియల్ రిమాండులో ఉన్న వైఎస్ షర్మిలను ఈరోజు ఉదయం ఆమె తల్లి వైఎస్ విజయమ్మ పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “వైఎస్ షర్మిల వైఎస్ రాజాశేఖర్ రెడ్డి బిడ్డ. ఇలాంటి కేసులకు, జైలుకు భయపడేరకం కాదు. తెలంగాణ ప్రజల కోసమే ఆమె పోరాడుతున్నప్పటికీ ఎవరూ ఆమెని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఒక ఆడపిల్ల 3800 కిమీ పాదయాత్ర చేయడం అంటే మాటలా? ఆమె నిరుద్యోగ యువత తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అరెస్ట్‌ చేయించింది. 

ఆమె ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడానికి కూడా పోలీసుల అనుమతి తీసుకోవాలా? ఆమెకు గుమ్మం దాటి ఎక్కడికి వెళ్ళే స్వేచ్చ లేదా? నా కూతురు ఓ ఉద్యమకారిణే తప్ప మావోయిస్టో ఉగ్రవాదో కాదు కదా?మరెందుకు ఆమెను పోలీసులతో అడ్డుకొంటున్నారు? కాంగ్రెస్‌, బిజెపి నేతలు పాదయాత్రలు, సభలు నిర్వహించుకోవడానికి అనుమతిస్తున్నప్పుడు నా కూతురు షర్మిలకు ఎందుకు అనుమతివ్వడం లేదు? టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై నా కూతురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ప్రభుత్వం ఆమె గొంతు వినపడకుండా అణచివేస్తోంది.ఈ ప్రభుత్వానికి రేపు ప్రజలే తగిన విదంగా బుద్ధి చెపుతారు. నిరుద్యోగుల కోసం నా కూతురు పోరాడి జైలుకి వెళితే ఎవరూ ఆమెకు సంఘీభావం తెలుపకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తోంది,” అని అన్నారు.

తెలంగాణలో రాజకీయాలు చేయడానికి కారణం ఏమిటో వైఎస్ షర్మిల నిజాయతీగా చెప్పుకొని ఉండి ఉంటే ప్రజలు ఆమెను ఆదరించేవారేమో? కానీ ఆమె తండ్రి పేరు చెప్పుకొంటూ, కేసీఆర్‌ని విమర్శిస్తూ తిరుగుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకొంటున్న ఆమె తన రాజకీయ ప్రయోజనాల కోసమే చెమటోడ్చుతున్నారని అర్దమవుతోంది. కానీ తెలంగాణ ప్రజల కోసం చెమటోడ్చుతున్నానని నమ్మబలుకుతున్నారు. ఆమె మాటలకి, రాజకీయ ఉద్దేశ్యాలకు పొంతన లేకపోవడం వలననే ఏడాదిగా పాదయాత్ర చేసినా ఆమెకు ప్రజాధారణ లభించలేదు. అందుకే ఆమె జైలుకి వెళ్ళినా రాష్ట్రంలో నిరుద్యోగులు సంఘీభావం తెలుపడంలేదు. 

ఇప్పుడు తల్లీకూతుర్లు ఇద్దరూ తెలంగాణ పోలీసులపై చెయ్యి చేసుకోవడమే కాకుండా వారితో చాలా అనుచితంగా మాట్లాడి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. అయినా తమకు తెలంగాణ ప్రజలు అండగా నిలబడాలని విజయమ్మ కోరుకోవడం దురాశే కదా? అయినా తన కూతురు షర్మిల చాలా ధైర్యవంతురాలని చెప్పుకొంటున్నప్పుడు ఆమెకు ప్రజల మద్దతు ఎందుకు?


Related Post