పోలీసులపై దాడి కేసులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్‌పై విధించడంతో పోలీసులు ఆమెను సోమవారం చంచల్‌గూడా జైలుకి తరలించారు. నిన్న ఉదయం ఆమె టిఎస్‌పీఎస్సీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ బృందాన్ని కలిసేందుకు హైదరాబాద్‌లోని తమ లోటస్ పాండ్ నివాసం నుంచి బయలుదేరుతుండగా, పోలీసులు ఆమెను అడ్డుకొన్నారు. అప్పుడు ఆమె ఓ మహిళా కానిస్టేబుల్, ఓ ఎస్సై మీద చెయ్యి చేసుకొన్నారు. ఆమె వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన వారిపైకి కారును నడిపించడంతో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు.
డ్యూటీలో ఉన్న పోలీసుల మీద చెయ్యి చేసుకొని వారిని ఉద్దేశ్యించి దుర్భాషలాడినందుకు, కానిస్టేబుల్‌ని గాయపరిచినందుకు జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సోమవారం రాత్రి 9.30 గంటల వరకు నాంపల్లి కోర్టులో ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి.
ఆమెకు 41 సీఆర్‌పీసీ ప్రకారం ముందుగా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కనుక ఆమె రిమాండ్ రద్దు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. కానీ న్యాయస్థానం అంగీకరించకపోవడంతో వారు ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని వాదించారు. బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని కోర్టు చెప్పడంతో పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకి తరలించారు.
ఆమె తల్లి విజయమ్మ కూడా నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చినప్పుడు ఆమె కూడా పోలీసులపై చెయ్యి చేసుకొన్నారు. కానీ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయలేదు. ఆమె ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తల్లి కనుక పోలీసులు ఉపేక్షించి ఉండవచ్చు.
వైఎస్ షర్మిల ఏడాదిపైగా తెలంగాణలో పాదయాత్ర చేసినా ప్రజలు, మీడియా, అధికార, ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. కానీ నిన్న జరిగిన ఈ ఘటనలతో ఇప్పుడు రాష్ట్రంలో అందరి దృష్టి ఆమెపై పడింది. ఆమె తొలిసారిగా జైలుకి కూడా వెళ్ళారు కనుక వైఎస్ షర్మిల రాజకీయాలలో ప్రాధమిక అర్హత సంపాదించుకొన్నట్లే!