బిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన ఇద్దరు సీనియర్ నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తుంటే, ఇప్పుడు వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిశ్చయించుకొన్నారని తాజా సమాచారం. ఈ నెల 30న సరూర్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహించబోయే నిరుద్యోగ దీక్షలో పాల్గొనేందుకు ప్రియాంకా గాంధీ హైదరాబాద్ రానున్నారు. ఆమె సమక్షంలో జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. వారివద్దకు రాహుల్ గాంధీ తన ప్రతినిధులను పంపించిద్దరినీ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా కోరడంతో వారు సానుకూలంగా స్పందించిన్నట్లు తెలుస్తోంది.
అయితే వారిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై పూర్తి పట్టు ఉండటం, అంగబలం, అర్దబలం కూడా ఉన్నందున ఆయనను ఎలాగైనా బిజెపిలోకి రప్పించాలని బిజెపి నేతలు కూడా ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒకవేళ వారి ప్రయత్నాలు ఫలిస్తే ఈ నెల 24వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేవెళ్ళ బహిరంగసభకు హాజరైనప్పుడు ఆయన సమక్షంలో కాషాయకండువా కప్పుకొంటారు లేకుంటే 30వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకొంటారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను ఏ పార్టీలో చేరినప్పటికీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో బిఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికలలో ఒక్క సీటు కూడా దక్కనివ్వనని శపధం చేశారు. కనుక ఈసారి ఆ రెండు జిల్లాలలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఉంటుంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర రావు మరి ఏవిదంగా నెగ్గుకొస్తారో చూడాలి.