మహారాష్ట్ర వరుసగా రెండు భారీ బహిరంగసభలు నిర్వహించి ఆ రాష్ట్రంలోకి చొచ్చుకుపోతున్న బిఆర్ఎస్ పార్టీకి తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 24న ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలో అంఖాస్ మైదానంలో బిఆర్ఎస్ మూడో బహిరంగసభను నిర్వహించేందుకు బిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకొంటున్నారు. కానీ భద్రతాకారణాల వలన అక్కడ బహిరంగసభ నిర్వహించేందుకు అనుమతిని నిరాకరిస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు బిఆర్ఎస్‌కు తెలియజేశారు. నగరంలో మరో చోట బహిరంగసభ నిర్వహించుకోవచ్చునని తెలిపారు.
ఇప్పటికే అంఖాస్ మైదానంలో బిఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు బిఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. భారీ ఫ్లెక్సీ బ్యానర్లు, పోస్టర్లను కూడా ముద్రించేశారు. అంఖాస్ మైదానంలో వేదిక ఏర్పాటుకు అన్ని సిద్దం చేసుకొన్నారు. బహిరంగసభకు ఇంకా 5 రోజులు సమయం ఉంది కనుక మళ్ళీ మరో అనువైన వేదిక కోసం గాలింపు మొదలుపెట్టారు.
సిఎం కేసీఆర్, బిఆర్ఎస్ మంత్రులు అందరూ మహారాష్ట్రలో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీని విమర్శిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని, ఇక్కడ మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కేసీఆర్ చెపుతున్నారు. మహారాష్ట్రలో కేసీఆర్ బిఆర్ఎస్ సభలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఇంతవరకు సంయమనం పాటించింది. తొలిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం సిఎం కేసీఆర్‌కి, బిఆర్ఎస్ నేతలకు ఈవిదంగా చిన్న షాక్ ఇచ్చిందనుకోవచ్చు.