మరో 4-5 నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికల గంట మోగనుంది. ప్రస్తుతం కర్ణాటక శాసనసభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. అది పూర్తవగానే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు తరచూ తెలంగాణకు వచ్చిపోతుంటారు. ముందుగా ఈ నెల 23న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. కర్నాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం.
చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. దానిలో పాల్గొనేందుకు ఆయన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఆ సభలోనే బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో సహా మరికొందరు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకొని బిజెపిలో చేరబోతున్నట్లు సమాచారం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా రాహుల్ గాంధీ ప్రతినిధి ఆహ్వానించారు. కానీ ఆయన బిజెపిలో చేరేందుకే మొగ్గు చూపుతునట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు లేదా బిజెపి పెద్దలు ఎవరు వస్తున్నా అధికార బిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ హైదరాబాద్‌లో ఫ్లెక్సీ బ్యానర్లు పెడుతుండటం, తెలంగాణ మంత్రులు వారిపై విరుచుకుపడుతుండటం, అందుకు ప్రతిగా బిజెపి నేతలు కూడా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం పరిపాటిగా మారిపోయింది. కనుక అమిత్ షా రాక సందర్భంగా మళ్ళీ మరోమారు బిఆర్ఎస్-బిజెపిల మద్య యుద్ధం ప్రారంభం కానుంది.