టిఎస్‌పీఎస్సీ కేసులో ఈడీ ఎంట్రీ... బిఆర్ఎస్‌కి కొత్త తలనొప్పులు?

April 17, 2023


img

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడి చాలా రోజులే అయ్యింది కనుక ఇప్పుడు ఆ వేడి కాస్త తగ్గిన్నట్లే ఉంది. మొదట్లో చాలా హాడావుడి చేసిన కాంగ్రెస్‌, బిజెపిలు, చివరికి మీడియా కూడా ఇప్పుడు వేరే అంశాలకి షిఫ్ట్ అవడంతో తెలంగాణ ప్రభుత్వం, సిట్‌ మీద ఒత్తిడి తగ్గిన్నట్లే కనిపిస్తోంది. అయితే ఈ కేసులో భారీగా అక్రమ నగదు లావాదేవీలు జరిగిన్నట్లు సిట్‌ కూడా ధృవీకరించడంతో ఎవరూ బొట్టు పెట్టి పిలవకుండానే ఈడీ ఎంట్రీ ఇచ్చింది. నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేసి ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌లను నేటి నుంచి రెండు రోజులు విచారించేందుకు కస్టడీకి అనుమతి పొందింది. ఈడీ అధికారులు చంచల్‌గూడ జైల్లోనే వారిద్దరినీ ప్రశ్నించబోతున్నారు. 

సిట్‌, ఈడీ రెండూ స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతాయని చెప్పుకొంటున్నప్పటికీ సిట్ తెలంగాణ ప్రభుత్వం కనుసన్నలలో, ఈడీ కేంద్ర ప్రభుత్వం కనుసన్నలలో పనిచేస్తుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ టిఎస్‌పీఎస్సీ స్కామ్‌లో బిఆర్ఎస్‌ పెద్దల హస్తం ఉందంటూ బండి సంజయ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. కనుక ఆ కోణంలో ఈడీ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తే కేసీఆర్‌ ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులు తప్పకపోవచ్చు.


Related Post