శుక్రవారం హైదరాబాద్‌లో 125 అడుగుల డా.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మీడియాకు తెలిపారు. ఒకవేళ ఆహ్వానించి ఉంటే తాను తప్పక హాజరయ్యేదానినని చెప్పారు. డా.అంబేడ్కర్ మహిళల హక్కులు, మహిళా సాధికారత, మహిళల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవడం అంటే ఎవరికైనా గర్వకారణమే. కానీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రధమ మహిళనైన నన్ను ఆహ్వానించకపోవడం చాలా బాధ కలిగించింది. కనుక రాజ్‌భవన్‌లోనే డా.అంబేడ్కర్ జయంతి వేడుకలు జరుపుకొని ఆ మహనీయుడికి నివాళులు అర్పించాము,” అని చెప్పారు.
డా.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అంటే రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలని, ప్రజల హక్కులని గుర్తుచేసే కార్యక్రమం. కానీ మోడీ పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్పూర్తి కొరవడుతోందని పదేపదే విమర్శలు గుప్పించే సిఎం కేసీఆర్, రాష్ట్రంలో వాటిని పట్టించుకోకపోవడం ద్వందవైఖరే కదా? తెలంగాణకు వర్తింపజేయని ప్రజాస్వామ్యాన్ని దేశానికి ఏవిదంగా వర్తింపజేయగలరు? అని ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నకు ఏం సమాధానం చెపుతారో?