తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొందరు పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు చెమటోడ్చుతుంటే, మరికొందరు నిత్యం ఏదో ఓ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో అయోమయం, ప్రజలలో అపనమ్మకం కలిగిస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారు. అటువంటి వారిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అగ్రస్థానంలో ఉంటారెప్పుడూ.
ఇంతకు ముందు బిఆర్ఎస్ పార్టీతో చేతులు కలపక తప్పదంటూ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించిన ఆయన తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతగా కృషి చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలాంటి సీనియర్లు సగం మంది కలిసిరాకపోయినా మిగిలినవారితో ధైర్యంగా ముందుకే సాగుతున్నారు.
టిఎస్‌పీఎస్సీ స్కామ్ విషయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సహా కాంగ్రెస్ సీనియర్ నేతలెవరూ ధైర్యం చేసి మాట్లాడలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి పోరాడుతున్నారు. అందుకు మంత్రి కేటీఆర్ నుంచి రూ.100 కోట్ల పరువు నష్టం దావాను కూడా ఎదుర్కొంటున్నారు!
కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ఇంతగా పోరాడుతున్నప్పుడు ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి ఆయనే అర్హుడవుతారు. ఇది పసిగట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకొనేందుకే హటాత్తుగా ఈ ‘దళిత ముఖ్యమంత్రి’ ప్రతిపాదన తెర పైకి తెచ్చిన్నట్లు భావించవచ్చు.
రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలనే ప్రయత్నంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన ద్వారా పార్టీలో అంతర్గతంగా చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. పార్టీ శ్రేణులలో అయోమయం ఏర్పడుతుంది. తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారు. కనుక ఇప్పుడు కాంగ్రెస్ అదే హామీ ఇస్తే ప్రజలు నమ్మరని తెసినా ఇటువంటి ప్రతిపాదన చేయడం ద్వారా కాంగ్రెస్ విశ్వసనీయతను కూడా పణంగా పెట్టిన్నట్లవుతుంది.
బిఆర్ఎస్, బిజెపి వంటి రెండు శక్తివంతమైన పార్టీలతో ఒంటరి పోరాటం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శల్యుడిలా మారారని చెప్పక తప్పదు. శల్యసారధ్యంతో చివరికి కర్ణుడంత మహావీరుడు ఏమయ్యాడో అందరికీ తెలుసు. కనుక ఎన్నికల కురుక్షేత్రంలో ప్రవేశించక ముందే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ఇటువంటివారిని వదిలించుకోవడం మంచిదేమో?