ముందే చెప్పుకొన్నట్లుగానే నేడు హుస్సేన్ సాగర్ పక్కన 125 అడుగుల డా.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 750 బస్సులలో బడుగు బలహీనవర్గాల ప్రజలను తీసుకువచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వందాలాదిమంది అధికారులు అందరినీ ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ కూతవేటు దూరంలో రాజ్‌భవన్‌లో ఉన్న రాష్ట్ర ప్రధమ మహిళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని మాత్రం ఆహ్వానించలేదు! కనుక ఆమె ఈ అధికారిక కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతిలేనిదే శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించేలేదనే విషయం సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అర్దమైంది కనుక విధిలేని పరిస్థితులలో కేసీఆర్ ఓ మెట్టు దిగి ఆమెను ఆహ్వానించారు. కనీసం ఆవిదంగానైనా రాజ్‌భవన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకొనే అవకాశం వచ్చింది కనుక ఆ సత్సంబంధాలను కొనసాగిస్తూ నేడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఆమెను గౌరవించి ఉండి ఉంటే ఎంతో హుందాగా ఉండేది.
ఈ సందర్భంగా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, హక్కుల గురించి సిఎం కేసీఆర్‌తో సహా అందరూ ఎలాగూ గట్టిగానే మాట్లాడుతారు. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం వలన మాటలకు చేతలకు మద్య చాలా దూరం ఉందనిపించకమానదు.
ఫోటో, వీడియో ఎన్టీవీ సౌజన్యంతో...