ఏపీ మంత్రి అప్పలరాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి, రాష్ట్రం గురించి చాలా అనుచితంగా మాట్లాడారు. దానిపై మంత్రి జగదీష్ రెడ్డి చాలా హుందాగా స్పందించినప్పటికీ చెప్పుతో కొట్టిన్నట్లు జవాబు చెప్పారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ ఉద్యోగులు, కార్మికులు లేకపోతే తెలంగాణలో ఏమీ జరుగదంటూ ఏపీ మంత్రి మాట్లాడిన మాటలు చాలా అపరిపక్వంగా, అజ్ఞానంగా ఉన్నాయి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగులు, కార్మికులు వలసలు వస్తున్నారంటే అర్దం ఏమిటి?ఆ రాష్ట్రంలో వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేవనే కదా?
ఒకప్పుడు సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఇటువంటి దుస్థితే నెలకొని ఉన్నందున లక్షలమంది ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. ఎంతగా అంటే ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళినవారే కాకుండా ఇతరా రాష్ట్రాల నుంచి దాదాపు 15 లక్షలమంది తెలంగాణలో ఉద్యోగాలు, ఉపాధి కోసం వలసలు వచ్చి ఇక్కడే స్థిరపడుతున్నారు.
వారందరినీ మేము మావారిగానే భావించి అక్కున చేర్చుకొంటున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇంకా ఎంతమంది వచ్చినా ఆదరిస్తామని చెప్పారు. ఇక్కడే హాయిగా జీవించండని చెప్పారు. అందులో తప్పేముంది? కానీ ఏపీ మంత్రి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు. ఏపీ నుంచి ప్రజలు ఎందుకు తెలంగాణకు వలసలు వస్తున్నారో ఆలోచించుకొంటే బాగుంటుంది. ఒక రాష్ట్రంలో ప్రజలు వేరే రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారంటే లోపం మన ప్రభుత్వంలోనే ఉందని గ్రహిస్తే మంచిది. ఏపీ మంత్రి చాలా అపరిపక్వంగా, రాజకీయ అజ్ఞానంతో మాట్లాడారు. ఆయనను ఏపీ ముఖ్యమంత్రి కంట్రోల్ చేస్తారని ఆశిస్తున్నాము,” అని చెప్పారు.