కేసీఆర్‌ని విమర్శించిన ఏపీ మంత్రికి అక్షింతలు

April 14, 2023


img

ఏపీ, తెలంగాణ మంత్రుల మద్య జరుగుతున్నా మాటల యుద్ధంలో నిన్న ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలంగాణ సిఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, కల్వకుంట్ల కవితలను ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టించాయి. మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై ఇంకా తెలంగాణ మంత్రులు తిరిగి స్పందించక మునుపే ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది.

నిన్న రాత్రి మంత్రి అప్పలరాజుకి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒకరు తీవ్రంగా మందలించిన్నట్లు సమాచారం. మీ స్థాయికి మించి మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశారని, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఆయన కుటుంబం గురించి ఈవిదంగా మాట్లాడటం ఏమిటని నిలదీసిన్నట్లు తెలుస్తోంది. దానికి మంత్రి అప్పలరాజు సంజాయిషీ చెప్పుకోబోగా అందుకు అవకాశం ఇవ్వకుండా గట్టిగా మొట్టికాయలు వేసిన్నట్లు తెలుస్తోంది. మీ వలన పొరుగు రాష్ట్రంతో సంబంధాలు దెబ్బ తింటాయని కనుక మళ్ళీ మరోసారి ఈవిదంగా మాట్లాడవద్దని గట్టిగా హెచ్చరించిన్నట్లు సమాచారం. 

ఏపీలో అధికార వైసీపీ పార్టీకి చెందిన మరికొంత మంది మంత్రులు కూడా మంత్రి హరీష్‌ రావు, కేటీఆర్‌లకు కౌంటర్ ఇచ్చారు కానీ వారు ‘వర్షం వస్తే హైదరాబాద్‌లో ఇళ్ళు మునిగిపోతుంటాయి... మీ ప్రభుత్వ పాఠశాలల కంటే మావి మెరుగుగా ఉన్నాయంటూ’ చాలా ఆచితూచి విమర్శించారు. కానీ మంత్రి అప్పలరాజు అన్ని హద్దులు దాటేసి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేసి చివరికి సొంత ముఖ్యమంత్రి చేతే మొట్టికాయలు వేయించుకోవలసి వచ్చింది. 


Related Post