బిఆర్ఎస్‌కు ఏపీలో మద్దెల మోత తప్పదా?

April 13, 2023


img

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుతామంటూ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి గురించి మంత్రి హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ ఏపీ, తెలంగాణ మంత్రుల మద్య మాటల యుద్ధం మొదలైంది. కేసీఆర్‌ తీరుపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. 

శ్రీకాకుళంలో ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ పేరులో టి తీసి బి పెడితే బిఆర్ఎస్ జాతీయపార్టీ అయిపోతుందా? బిఆర్ఎస్ ఓ ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ ఉన్మాదం నుంచి పుట్టిన పార్టీ. ఆంద్ర రాష్ట్రం, ఆంధ్రా ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన పార్టీ టిఆర్ఎస్‌. చుట్టుపక్కల అందరూ బాగుండాలని కోరుకొంటే అది జాతీయవాదం. కానీ ఆంధ్రా ప్రజల అభీష్టానికి విరుద్దంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కేసీఆర్‌ జాతీయవాదం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి ప్రాంతీయవాదంతో వ్యవహరించే మీరా దేశాన్ని ఉద్దరించేది? మీరు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ గురించి మాట్లాడేస్తే మీది జాతీయ పార్టీ అయిపోతుందా?ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంటే ఏమనుకొంటున్నారు? మీ కుటుంబ జాగీరనుకొన్నారా?మీ కొడుకు, కూతురు, మేనల్లుడు కలిసి పరిపాలించుకోవడానికి ఇదేమీ తెలంగాణ రాష్ట్రం కాదని గుర్తుంచుకోండి,” అంటూ ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. 

ఏపీలో అన్ని పార్టీలు తమతమ రాజకీయ ప్రయోజనాలే చూసుకొంటున్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం ఏం చేశాయని మంత్రి హరీష్‌ రావు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేకపోయారు.  తాము సింగరేణి ప్రైవేట్ పరంకాకుండా కాపాడుకోవడానికి పోరాడుతున్నామని కానీ ఏపీలో అధికార, ప్రతిపక్షా పార్టీలు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ తమ కళ్ళముందే అమ్ముడుపోతున్నా పట్టించుకోవడం లేదని మంత్రి హరీష్‌ రావు అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం దానిని కాపాడేందుకు ప్రయత్నించాలనుకొందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అయితే అనేక సమస్యలతో సతమతమవుతున్న జగన్ ప్రభుత్వానికి వాటిపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి తెలంగాణ మంత్రులతో ఈవిదంగా మాటల యుద్ధం కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. లేకుంటే మంత్రి హరీష్‌ రావు, కేటీఆర్‌ అడిగిన ప్రశ్నలకు వారు సిగ్గుతో తలాడించుకొని ఉండాలి కదా? అయితే రేపు ఏపీలో బిఆర్ఎస్ పార్టీ అడుగుపెడితే ఏ స్థాయిలో విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందో ఏపీ మంత్రుల మాటలతో స్పష్టం అవుతోంది. కనుక కేసీఆర్‌ మరింత బలమైన అంశాలతో వారిని ఎదుర్కొంటూ ఏపీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది. 


Related Post