ఏపీ, తెలంగాణలకు జమీన్ ఆస్మాన్ ఫరక్: మంత్రి హరీష్‌

April 12, 2023


img

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలనే ప్రతిపాదనతో ఏపీ, తెలంగాణల మద్య వివాదం మొదలైంది. అది కొనసాగుతుండగానే మంత్రి హరీష్‌ రావు చేసిన తాజా వ్యాఖ్యలు ఆ నిప్పును మరింత రాజేసివిగా ఉన్నాయి. 

సంగారెడ్డి పట్టణంలో మంగళవారం మేస్త్రి సంఘం కోసం ప్రభుత్వం కట్టించబోతున్న భవనానికి మంత్రి హరీష్‌ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడకి అనేక రాష్ట్రాలవారు ఉద్యోగాలు, ఉపాది కోసం వచ్చి ఇక్కడే స్థిరపడుతున్నారు. వారిలో ఆంద్రావాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఆంధ్రా నుంచి వచ్చిన మీరందరూ అక్కడ ఏపీలో రోడ్లు, దవాఖనాలు ఎలా ఉన్నాయో, ఇక్కడ తెలంగాణలో ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా? ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మద్య భూమికి ఆకాశానికి మద్య ఉన్నంత తేడా ఉంది. కనుక ఇంకా అక్కడ ఏపీలో ఉండాలని ఎందుకు అనుకొంటున్నారు? 

అక్కడ మీ ఓట్లని రద్దు చేసుకొని ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకోండి. తెలంగాణకు శాస్వితంగా వచ్చేయండి. మీరందరూ తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర షిస్తున్నారు. కనుక మీరు కూడా మావాళ్ళే. తెలంగాణ కోసం చెమట చిందించే ప్రతీ ఒక్కరూ తెలంగాణ బిడ్డలే. మీరు ఆంధ్రా, తెలంగాణ అంటూ రెండు దిక్కులలో పరుగులు తీయకుండా ఒకే దిక్కు పెట్టుకోండి. అదే తెలంగాణ. 

మే 1వ తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కార్మిక సోదరులందరికీ ఓ శుభవార్త వినిపించబోతున్నారు. ఆంధ్రా నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులందరూ కూడా భవన నిర్మాణ కార్మిక మండలిలో తప్పనిసరిగా సభ్యత్వం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలను, ప్రయోజనాలను పొందండి,” అని మంత్రి హరీష్‌ రావు అన్నారు. 

మంత్రి హరీష్‌ రావు ఆంద్రా గురించి చెప్పింది అక్షరాల నిజమని అందరికీ తెలుసు. అయితే ఉద్యోగులకు నెలనెలా జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న అధికార వైసీపీ తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శప్రాయమైన పాలన అందిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటోంది. కనుక మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు భగ్గుమనడం, దాంతో బిఆర్ఎస్, వైసీపీల మద్య కొన్ని రోజులపాటు వాదోపవాదాలు జరగడం ఖాయమే.               



Related Post