టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ స్కామ్‌లో ఇంతవరకు తెలంగాణ పోలీస్ శాఖలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈడీ కూడా రంగంలో దిగడంతో కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. సిట్ బృందం తమ దర్యాప్తు నివేదికని సీల్డ్ కవరులో ఈరోజు హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసు విచారణ పారదర్శకంగా సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి తెలియజేశారు. కానీ ఈ కేసులో పెద్ద చేపలను విడిచిపెట్టేసి చిన్న చేపలను పట్టుకొన్నారని కనుక ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసు తదుపరి విచారణ 24కి వాయిదా పడింది.
అయితే ఇవాళ్ళే ఈడీ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిన్నట్లు అనుమానిస్తున్నామని కనుక ఈ కేసుకు సంబందించి సిట్ వద్ద ఉన్న రికార్డులన్నీ తమకు అప్పగించవలసిందిగా ఆదేశించాలని ఈడీ కోరింది. చంచల్‌గూడ జైలులో ఉన్న 17 మంది నిందితులను ప్రశ్నించేందుకు, విచారణ కోసం జైల్లో ల్యాప్‌టాప్, ప్రింటర్, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించుకొనేందుకు అనుమతించాలని ఈడీ కోర్టుని అభ్యర్ధించింది.
సిట్ దర్యాప్తు ఏవిదంగా రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నలలో జరుగుతుందో అదేవిదంగా ఈడీ, సీబీఐ దర్యాప్తులు కేంద్ర ప్రభుత్వం కనుసన్నలలో జరుగుతుంటాయనేది బహిరంగ రహస్యం. ఈ కేసులో ఈడీ జోక్యం చేసుకోవడానికి సాంకేతికంగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఈడీ దర్యాప్తు మొదలుపెడితే అది బిఆర్ఎస్ పెద్దలని ప్రశ్నించకుండా ఉండదు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లాగే బిఆర్ఎస్, బిజెపిల మద్య మరో కొత్త యుద్ధం మొదలవబోతుందన్నమాట!