బిఆర్ఎస్‌కు ఎన్నికల కమీషన్‌ షాక్!

April 11, 2023


img

సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించే ప్రయత్నంలో ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించుకొంటున్నారు. మహారాష్ట్ర, పంజాబ్‌ తదితర రాష్ట్రాలలో బిఆర్ఎస్‌ కిసాన్ సెల్‌ అధ్యక్షులను నియమించుకొన్నారు. కానీ కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల కమీషన్‌ పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్నికల నియామవళి-1968లోని 6వ పేర ప్రకారం గత రెండు ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీ ఇతర రాష్ట్రాలలో పోటీ చేసి 6 శాతం ఓట్లు లేదా 2 శాసనసభ సీట్లు గెలుచుకోలేదు కనుక ఏపీ బిఆర్ఎస్‌ పార్టీకి రాష్ట్ర హోదా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

తెలంగాణలో మాత్రం బిఆర్ఎస్‌ రాష్ట్ర పార్టీ హోదా యధాతధంగా ఉంటుంది. వచ్చే ఎన్నికలలో ఏపీలో కూడా బిఆర్ఎస్‌ పోటీ చేయాలనే ఆలోచనతోనే కేసీఆర్‌ తోట చంద్రశేఖర్‌ని ఏపీ బిఆర్ఎస్‌ అధ్యక్షుడుగా నియమించుకొన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర పార్టీ హోదా రద్దు అవడంతో ఆయన పదవి కూడా పోయిన్నట్లే. 

బిఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఇతర రాష్ట్రాలలో పోటీ చేయలేదు కనుక జాతీయపార్టీ హోదా లేదు. ఇప్పుడు ఏపీ బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర హోదా రద్దు చేయడంతో, ఏపీతో సహా మరే రాష్ట్రంలో పోటీ చేసినా ఎన్నికల కమీషన్‌ ఇవ్వబోయే ఎన్నికల చిహ్నాలతోనే పోటీ చేయవలసి ఉంటుంది. కేసీఆర్‌ ఎంతో దూరం ఆలోచించి టిఆర్ఎస్‌ పేరును బిఆర్ఎస్‌గా మార్చుకొంటే, ఈ నిర్ణయంతో కేంద్ర ఎన్నికల కమీషన్‌ కేసీఆర్‌ చేతులు కట్టేసిన్నట్లు చెప్పవచ్చు. 

ఇక బిఆర్ఎస్‌ పార్టీతో కలిసి పనిచేస్తున్న వామపక్షాలలో సీపీఐ పార్టీ జాతీయ పార్టీ హోదాని కూడా ఎన్నికల కమీషన్‌కు రద్దు చేయడం కేసీఆర్‌కు మరో ఎదురుదెబ్బ అని భావించవచ్చు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్‌ (మమతా బెనర్జీ), మహారాష్ట్రకు చెందిన నేషనల్ కాంగ్రెస్‌ పార్టీ (శరద్ పవార్) పార్టీలకు కూడా జాతీయహోదాను రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించి మరో షాక్ ఇచ్చింది. 

అయితే ఢిల్లీలో పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమాద్మీ పార్టీ ఇటీవల పంజాబ్‌ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావడమే కాకుండా గుజరాత్‌, గోవా రాష్ట్రాల ఎన్నికలలో  పోటీ చేసినందున ఆ పార్టీకి జాతీయపార్టీ హోదా కల్పిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. కనుక ఆమాద్మీ పార్టీ ఇకపై తన చీపురుకట్ట గుర్తుతో దేశవ్యాప్తంగా పోటీ చేయవచ్చు.  



Related Post