రాష్ట్ర విభజన కారణంగా కేసీఆర్ ఆంద్ర ప్రజల ఆగ్రహానికి గురైనప్పటికీ, ఈ తొమ్మిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొన్న తీరుచూసి వారు కూడా కేసీఆర్‌ను ప్రశంశించకుండా ఉండలేకపోతున్నారు. అందుకే కేసీఆర్ ఎప్పుడు ఏపీలో అడుగుపెట్టినప్పటికీ ఆయనకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలుకుతుంటారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీతో నదీజలాలు, ఆస్తులు,అప్పుల వివాదాలు కొనసాగుతున్నందున, బిఆర్ఎస్ పార్టీ ఏపీలో ప్రవేశించడం ఇబ్బందికరంగా మారింది.
బహుశః అందుకే కేసీఆర్ ఇంతకాలం కలిసున్న తెలుగు రాష్ట్రమైన ఆంధ్రావైపు వెళ్ళకుండా మహారాష్ట్ర వైపు వెళుతున్నారనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని రూపంలో ఏపీలో బిఆర్ఎస్‌ని విస్తరించేందుకు ఓ గొప్ప అవకాశం లభించింది. గమ్మతైన విషయం ఏమిటంటే, దీనిని ఆయన ప్రియ రాజకీయ శత్రువు ప్రధాని నరేంద్రమోడీయే ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వరంగసంస్థలను వదిలించుకొనే ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని అమ్మకానికి పెట్టేసింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ఏపీ ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తునప్పటికీ మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ నెల 15వ తేదీలోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి, నిర్వహణ, బొగ్గు సరఫరా, స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన ఉక్కు కొనుగోలు చేసేందుకు ఆసక్తిగల సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)ని ఆహ్వానించింది.
కేసీఆర్ దీనిని ఓ గొప్ప రాజకీయ, వ్యాపార అవకాశంగా గుర్తించారు. ఇలా గుర్తించడమూ గొప్ప విషయమే కదా?
తెలంగాణ ప్రభుత్వం తరపున సింగరేణి లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. దీని కోసం ఐటి, పరిశ్రమల శాఖల కార్యదర్శి జయేష్ రంజన్ నేతృత్వంలో అధికారుల బృందం విశాఖపట్నంకు వెళ్ళి, సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.
ఒకవేళ సాధ్యపడితే, ఉత్తరాంద్ర జిల్లా ప్రజల సెంటిమెంటుతో ముడిపడున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడిన్నట్లవుతుంది కనుక అప్పుడు బిఆర్ఎస్ ఎటువంటి సంకోచమూ లేకుండా ఏపీలో అడుగుపెట్టగలదు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి అవసరమైన బొగ్గును సరఫరా చేయించడం ద్వారా సింగరేణి సంస్థకి భారీగా ఆదాయం సమకూర్చిన్నట్లవుతుంది.
స్టీల్ ప్లాంట్ నిర్వహణతో దానిలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులతో, స్థానిక ప్రజలతో బిఆర్ఎస్ అనుబందం ఏర్పడి పెంచుకోవచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణ సింగరేణి చేతిలో ఉన్నట్లయితే, దానిలోలో ఉత్పత్తి అయిన ఉక్కును సరసమైన ధరకు తెలంగాణ అవసరాలకు సరిపడా కొనుగోలు చేసుకోవచ్చు. కనుక ఓ వ్యాపార అవకాశంలో రాజకీయ అవకాశాన్ని కూడా చూడగలగడం కేసీఆర్ దూరదృష్టికి మరో నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అంతే కాదు... ఏపీలో బిఆర్ఎస్ పార్టీని నిలదీసేందుకు సిద్దంగా ఉన్న టిడిపి, వైసీపీ, జనసేన పార్టీలకు కేసీఆర్ దీంతో పెద్ద షాక్ ఇవ్వారనే చెప్పొచ్చు. ఇప్పుడు కేసీఆరే తిరిగి వాటిని దీనిపై గట్టిగా నిలదీయగలరు కూడా.