తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ఆమోదం కోసం ఎదురు చూస్తున్న 10 బిల్లులపై నేడు కీలక నిర్ణయం తీసుకొన్నారు. వాటిలో మూడింటికి ఆమోదం తెలిపి, మరో రెండు బిల్లులను తెలంగాణ ప్రభుత్వాన్ని వెనక్కు తిప్పి పంపారు. మరో రెండు బిల్లులపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయం కోరుతూ రాష్ట్రపతి భవన్‌కు పంపించారు. మిగిలిన రెండు బిల్లులను పరిశీలన కోసం పక్కన పెట్టేరు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10 బిల్లులు పంపితే వాటిలో కేవలం మూడింటినే గవర్నర్ ఆమోదించారు కనుక మళ్ళీ బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యే ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ఖాయమనే భావించవచ్చు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 10 బిల్లులు ఆమోదించకుండా తొక్కిపట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేస్తూ గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, ఈ వ్యవహారంలో కలుగజేసుకోలేమని తేల్చి చెప్పడంతో ప్రభుత్వం చేతులు కట్టేసిన్నట్లయింది. అయితే సీఎస్ శాంతికుమారి, సంబందిత శాఖల మంత్రులు స్వయంగా రాజ్‌భవన్‌కు వచ్చి మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించినప్పటికీ, ప్రభుత్వం తరపున ఎవరినీ పంపలేదు. కనుక బిల్లులపై ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆమె స్వయంగా మూడు బిల్లులను ఆమోదించారు. కానీ మిగిలిన 8 బిల్లులపై ఎటూ తేల్చకపోవడంతో ఈ వివాదం మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది.