జూపల్లి, పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం కొత్తగూడెంలో

April 10, 2023


img

తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు గత ప్రభుత్వంలో మంత్రులుగా ఓ వెలుగువెలిగారు. కానీ 2018 ముందస్తు ఎన్నికలలో ఇద్దరూ ఓడిపోయిన తర్వాత కేసీఆర్‌ వారిని పట్టించుకోలేదు. ఇటీవల ఖమ్మంలో బిఆర్ఎస్‌ బహిరంగసభ నిర్వహించినప్పుడు మళ్ళీ తుమ్మలను కలుపుకొన్నారు కానీ జూపల్లిని, అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పట్టించుకోలేదు. ఇప్పటికే పొంగులేటి భద్రాది కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ కేసీఆర్‌ మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కూడా ఆయనతో చేతులు కలిపారు. కొత్తగూడెంలో నిన్న పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కూడా హాజరయ్యి ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్దమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్‌, బిజెపిల సహకారంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దానిని కేసీఆర్‌ కుటుంబం కబ్జా చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ దోచుకొంటోంది. పైగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ నిలువునా ముంచేస్తోంది. ప్రజలు ఆయనపై పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేసుకొన్నారు. కనుక మరోసారి ముఖ్యమంత్రి అవడం అసంభవం. టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చి తెలంగాణతో బంధాన్ని తెంచేసుకొన్నారు. ప్రజలలో కూడా కేసీఆర్‌, బిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌ ఓటమి, ప్రభుత్వం మార్పు ఖాయం,” అని అన్నారు. 

జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, “సాగునీటి ప్రాజెక్టులలో కేసీఆర్‌ వేలకోట్లు వెనకేసుకొన్నారు. ప్రగతి భవన్‌లోకి కనీసం ఎమ్మెల్యేలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక సామాన్యుల గోడు వినేదెవరు? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్న కేసీఆరే దానిని దెబ్బ తీస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు ఆయనకు తగిన విదంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు. 

రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ వైఖరిని, పాలనను వ్యతిరేకిస్తున్నారా లేదా అనే విషయం ఎన్నికల తర్వాత తెలుస్తుంది. కానీ తెలంగాణలో కేసీఆర్‌కి వ్యతిరేక రాజకీయ శక్తులన్నీ ఈవిదంగా ఏకం అవుతున్నందున వారి కారణంగా వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది.


Related Post