మాజీ ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు అద్భుతమైన వాక్చాతుర్యంతో, చక్కటి అంత్యప్రాసలతో అందరికీ అలరించే విదంగా ప్రసంగిస్తారనే విషయం తెలిసిందే. కానీ ఆయనను ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చోబెట్టి ప్రధాని నరేంద్రమోడీ ఆయన నోటికి తాళం వేసేసేరనే ఆరోపణలు కూడా వినిపించేవి. అయితే ఆయన పదవీ విరమణ పొందారు కనుక మళ్ళీ కాస్త స్వేచ్చగా వివిద అంశాలపై తన అభిప్రాయాలను చెప్పగలుగుతున్నారు.
తాజాగా ప్రముఖ రచయిత సంజయ్ కిషోర్ రచించిన “స్వాతంత్రోద్యమం-తెలుగు సినిమా-ప్రముఖులు” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో, బహిరంగసభలు జరుగుతున్నా తీరు గురించి చెప్పారు. “ఒకప్పుడు ఎవరైనా ప్రముఖుల సభలు జరుగుతున్నాయంటే ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి వారు చెప్పినవి శ్రద్దగా వినేవారు. కానీ ఇప్పుడు ఎంత ప్రముఖుడి బహిరంగసభకైనా తప్పనిసరిగా మూడు ‘బీ’లు అవసరం. అవి లేకుంటే జనాలు రారు. ఆ మూడు బీలు ఏమిటంటే, ఒకటి బస్సు, రెండు బిర్యానీ, మూడవది (మందు) బాటిల్. ఈ పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోంది. ఈవిదంగా జనసమీకరణ చేసి తమ బహిరంగసభ విజయవంతమైందని రాజకీయనాయకులు పొంగిపోతుండటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది,” అని వెంకయ్య నాయుడు తన మనసులో మాట చెప్పారు. నిజమే కదా?సభకి ఎందుకు వచ్చామో? దానిలో నేతలు ఏమి చెపుతున్నారో? అవి నిజమా కాదా? అని ప్రజలు ఆలోచించనప్పుడు అటువంటి సభల వలన ఏం ప్రయోజనం?