పరువు నష్టం నోటీస్ వెనక్కు తీసుకోకపోతే క్రిమినల్ కేసు వేస్తా!

April 08, 2023


img

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌కు సంబంధం ఉందంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌లు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాటి వలన తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని, కనుక బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాలంటూ మంత్రి కేటీఆర్‌ వారిద్దరికీ లీగల్ నోటీసులు పంపగా నేడు రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ ఏకంగా ఏడు పేజీల లేఖతో సమాధానం పంపారు.

దానిలో రేవంత్‌ రెడ్డి ఏమి తెలియజేశారంటే, “మంత్రి కేటీఆర్‌ మీకు (లాయర్) నా గురించి తప్పుడు సమాచారం అందించారు. తెలంగాణ ఉద్యమాలలో ఉద్యోగాలు కూడా ఓ ముఖ్యమైన అంశం. కనుక నేను రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగుల తరపున మాట్లాడాను. టిఎస్‌పీఎస్సీకి అవసరమైన సాంకేతిక మద్దతు రాష్ట్ర ఐ‌టి శాఖ అందిస్తున్నప్పుడు, ఈ స్కామ్‌లో నేరారోపణ ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి ఐ‌టి శాఖ ద్వారానే టిఎస్‌పీఎస్సీలో నియమితుడయ్యాడైనప్పుడు ఐ‌టి శాఖకు, దాని మంత్రికి ఈ స్కామ్‌తో సంబందం లేదని ఏవిదంగా చెప్పగలరు? 

టిఎస్‌పీఎస్సీలో పరీక్షలకు ముందే పేపర్ లీక్ అయ్యింది. పదో తరగతి పరీక్ష జరుగుతుండగా అవుట్ అయ్యింది. రెంటికీ చాలా తేడా ఉంది. బండి సంజయ్‌పై అభియోగాలు మోపి అరెస్ట్‌ చేసిన తర్వాత ఆయన బెయిల్‌ పొందుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని ఎందుకు ఆశ్రయించలేదు? అంటే బిజెపి, బిఆర్ఎస్‌ ప్రభుత్వాలు రెండూ కలిసి ఈ డ్రామా ఆడిన్నట్లు భావించవలసి ఉంటుంది కదా? 

టిఎస్‌పీఎస్సీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు  అసలు నిందితులను ప్రశ్నించకుండా, టిఎస్‌పీఎస్సీ అధికారులను సాక్షులుగా పిలిచి ప్రశ్నిస్తున్నారు. టిఎస్‌పీఎస్సీ కేసు దర్యాప్తుకి సంబందించిన అంశాలు మంత్రి కేటీఆర్‌కు ఏవిదంగా తెలుస్తున్నాయి?ఆ వివరాలను సిట్‌ అధికారులే ఆయనకు చెపుతున్నారా?ఒకవేళ అదే చేస్తున్నట్లయితే, మీరు నాకు లీగల్ నోటీస్ పంపించడం కాదు నేనే మీపై క్రిమినల్ కేసు వేయవలసి వస్తుంది. కనుక తక్షణం లీగల్ నోటీస్ తక్షణం వెనక్కు తీసుకోవాలని కోరుతున్నాను,” అంటూ రేవంత్‌ రెడ్డి లేఖలో సూచించిన్నట్లు తెలుస్తోంది.


Related Post