ప్రధాని పర్యటన ముందు బండిని అరెస్ట్ చేసి కేసీఆర్ కేంద్రానికి సవాల్ విసిరారా?

April 07, 2023


img

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి హన్మకొండ జిల్లా కోర్టులో ఉపశమనం లభించింది. ఆయనకు ఇద్దరు వ్యక్తుల హామీ, రూ.20 వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయితే ఈరోజు సాయంత్రం కానీ లేదా రేపు ఉదయం గానీ కరీంనగర్‌ జైలు నుంచి విడుదలకావచ్చు. 

ప్రధాని నరేంద్రమోడీ సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవం, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు  శనివారం హైదరాబాద్‌కు రాబోతున్నారు. సరిగ్గా ఆయన హైదరాబాద్‌కు వచ్చే ముందు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ కూడా అయిన బండి సంజయ్‌ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపడం ద్వారా సిఎం కేసీఆర్‌ కేంద్రానికి మరోసారి సవాలు విసిరిన్నట్లయింది. కానీ హన్మకొండ కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో పెద్ద రాజకీయ ఉపద్రవం తప్పించిన్నట్లయింది. 

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నప్పుడు  బండి సంజయ్‌ జైల్లోనే ఉండి ఉంటే, దీనిని ఆయన చాలా తీవ్రంగా పరిగణించి ఉండేవారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తన వైఫల్యాన్ని, అసమర్ధతని కప్పి పుచ్చుకొనేందుకే బండి సంజయ్‌పై అక్రమకేసు బనాయించి అరెస్ట్‌ చేసిందని బిజెపి నేతలు వాదిస్తుంటే, తమ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయడం కోసమే ఢిల్లీలో బిజెపి పెద్దల డైరెక్షన్‌లో బండి సంజయ్‌ ఇటువంటి నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావు తదితరులు ఆరోపిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో బిఆర్ఎస్‌, బిజెపిలకి మద్య రాజకీయ ఆధిపత్యపోరు జరుగుతున్నందున ఈ లీకేజి వ్యవహారంతో బండి సంజయ్‌కి నిజంగా సంబందం ఉందా లేదా?అనేది ఎవరూ చెప్పలేరు. 

కానీ ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు ముందు బండి సంజయ్‌ని జైలుకి పంపించి సిఎం కేసీఆర్‌ మరోసారి కేంద్రానికి సవాలు విసిరారని చెప్పవచ్చు. దీని తదనంతర పరిణామాలు ఏవిదంగా ఉండబోతున్నాయో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.                   



Related Post