సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనే ఆలోచనలు చేస్తున్నప్పుడు మొదట బెంగళూరుకి వెళ్ళి కర్ణాటకలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ జెడిఎస్ అధినేతలు దేవగౌడలతో దోస్తీ కలిపారు. ఆ తర్వాత కుమార్తె కల్వకుంట్ల కవితతో సహా బిఆర్ఎస్ నేతలను వెంటబెట్టుకొని ముంబై వెళ్ళి శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేని కలిశారు. అందరం కలిసి పోరాడుదామని అనుకొన్నారు.
కానీ ఇప్పుడు కుమారస్వామి కేసీఆర్ వైపు చూడటం లేదు. మొదట కర్ణాటకలోనే పోటీ చేస్తామని చెప్పిన కేసీఆర్, కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా అటువైపు చూడటం లేదిప్పుడు! సీట్ల పంపకాలలో తేడా వచ్చినందున దూరమయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణతో మహారాష్ట్ర సరిహద్దు పంచుకొంటున్నందున మహారాష్ట్రలో పార్టీని సులువుగా విస్తరించవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే మహారాష్ట్రలోని నాందేడ్, కాందార్ లోహలో రెండు బిఆర్ఎస్ సభలు విజయవంతంగా నిర్వహించారు. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేరు కూడా.
కానీ మహారాష్ట్రలో శివసేనతో దోస్తీకి ప్రయత్నించి, ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను బిఆర్ఎస్‌లో చేర్చుకోవడమే అభ్యంతరకరం అవుతుంది. మహారాష్ట్రలో బీడ్ జిల్లా శివసేన అధ్యక్షుడుగా ఉన్న దిలీప్ గోరే తదితరులు బుదవారం హైదరాబాద్ రాగా సిఎం కేసీఆర్ వారందరినీ ప్రగతి భవన్‌కు ఆహ్వానించి బిఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకొన్నారు. అంటే మహారాష్ట్రలో శివసేనకు కూడా కేసీఆర్ కటీఫ్ చెప్పేసిన్నట్లే భావించవచ్చు.
కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచాలనే నిర్ణయం, అందరూ తన నాయకత్వాన్ని అంగీకరించాలనే అప్రకటి షరతు కారణంగా చాలా పార్టీలు ఆయనకు దూరం అవుతున్నాయి లేదా దూరంగా ఉంటున్నాయి. ఇప్పుడు సీట్ల సర్దుబాటు కుదరకపోవడం వలన కర్ణాటకలో పోటీ చేయలేక, తనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిన మిత్రపక్షం శివసేనకు చెందిన నేతలను బిఆర్ఎస్‌లో చేర్చుకోవడం వలన, కేసీఆర్ మరింత ఒంటరి వారవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తన మాటకు ఎదురులేకపోవచ్చు కానీ ఇతర రాష్ట్రాలలో కూడా తనకు ఎదురే ఉండకూడదనో లేదా ఎదురేలేదని అనుకొంటే ఎవరికి నష్టం?