బండి సంజయ్‌కు 2 వారాలు రిమాండ్‌... జైలుకి తరలింపు

April 05, 2023


img

పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి హన్మకొండ మేజిస్ట్రేట్ రెండు వారాలు జ్యూడీషియల్ రిమాండ్‌ విధించారు. మేజిస్ట్రేట్ రావుల అనిత ఎదుట ప్రభుత్వం, బండి సంజయ్‌ తరపు న్యాయవాదులు సుమారు 2 గంటల సేపు వాడివేడిగా వాదించుకొన్నారు.

బండి సంజయ్‌కి బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోరినప్పటికీ, మేజిస్ట్రేట్ ఆయనకు రెండు వారాలు జ్యూడీషియల్ రిమాండ్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కోర్టు బయట వేలాదిగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వానికి, సిఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనుక భారీ బందోబస్తు మద్య బండి సంజయ్‌ని కరీంనగర్ జైలుకి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ కేసులో బండి సంజయ్‌ని పోలీసులు ఏ-1 నిందితుడుగా రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఆయన ప్రశాంత్ (ఏ-2) మాజీ జర్నలిస్టుతో కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలుజేసేందుకు పదో తరగతి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వారిరువురితో పాటు మరో 8 మందిని నిందితులుగా రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. వారిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. 

ఇదివరకు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు బిజెపి ప్రతినిధులను సిఎం కేసీఆర్‌ వలపన్నించి అరెస్ట్‌ చేయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్రమైన నేరారోపణతో అరెస్ట్‌ చేయించడం ద్వారా సిఎం కేసీఆర్‌ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరిన్నట్లయింది. ప్రతీక్రియకు సమాన ప్రతిక్రియ తప్పక ఉంటుంది కనుక బహుశః రేపో ఎల్లుండో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి మళ్ళీ పిలుపు వస్తుందేమో?


Related Post