ప్రముఖ నిర్మాత దిల్‌రాజు త్వరలో రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో’లో భాగంగా నిజామాబాద్‌లో పాదయాత్ర చేసినప్పుడు దిల్‌రాజు వెళ్ళి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. నిజామాబాద్‌లో తన సొంత నిధులతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళ్ళి రేవంత్ రెడ్డి చేత ప్రత్యేక పూజలు చేయించారు. అప్పటి నుంచే దిల్‌రాజు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వాటిపై దిల్‌రాజు స్పందిస్తూ, “ఈ సినిమా ఇండస్ట్రీలో తగులుతున్న రాళ్ళ దెబ్బలనే నేను ఓర్చుకోలేక బాధపడుతుంటాను. ఇక ఆ రాజకీయాలలో తగిలే దెబ్బలను ఎలా తట్టుకోగలను? నేను రాజకీయాలలోకి రావడం లేదు. అటువంటి ఆలోచన చేయడం లేదు కూడా,” అని అన్నారు.
ఇంతకు ముందు బలగం సినిమా విడుదల ముందు దిల్‌రాజు తన సినీ బృందంతో కలిసి మంత్రి కేటీఆర్ తదితరులతో సన్నిహితంగా తిరిగారు. అప్పుడూ దిల్‌రాజు బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే సినీ పరిశ్రమలో కోట్లు రూపాయల పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్నవారందరూ రాజకీయ నాయకులతో ఎప్పుడూ అవసరమో లేదా ఇబ్బందులో ఉంటూనే ఉంటాయి. సినీ రంగంలో వారి జీవితాలను మొసళ్ళ చెరువులో చేపల వంటివని చెప్పవచ్చు. కనుక అందరినీ తప్పించుకొంటూ, మెప్పించుకొంటూ మనుగడ సాగించాల్సి ఉంటుంది. దిల్‌రాజు కూడా అదే చేస్తున్నారనుకోవచ్చు.