అవును పేపర్ లీక్ అయ్యింది కానీ దానిని లీక్ అనలేము!

April 04, 2023


img

తెలంగాణ పదో తరగతి పరీక్షలలో నేడు రెండో రోజున హిందీ పరీక్ష జరిగింది. నిన్న అదిలాబాద్ జిల్లాలో జరిగిన్నట్లే నేడు వరంగల్‌ జిల్లాలో ఓ పరీక్షాకేంద్రం నుంచి ఎవరో తమ ఫోన్‌లో ఫోటో తీసి వాట్సప్ ద్వారా బయటకు పంపిన్నట్లు సిపి రంగనాధ్ ధృవీకరించారు. పరీక్ష మొదలైన గంట తర్వాత పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినందున దీనిని లీక్‌ అని చెప్పడం సరికాదని సిపి రంగనాధ్ అన్నారు. అప్పటికే విద్యార్థులందరూ సగం పరీక్ష వ్రాసేసి ఉంటారు కనుక దీని ప్రభావం పరీక్షపై ఉండదని సిపి రంగనాధ్ అన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని ఈరోజు సాయంత్రంలోగా ఎవరు పేపర్ లీక్ చేశారు? ఎవరెవరికి పంపించారనే విషయం కనుగొని మీడియాకు వివరిస్తామని చెప్పారు.  

అయితే విద్యార్థులందరూ పరీక్షా కేంద్రాలలో పరీక్షలు వ్రాస్తున్నప్పుడు, లోపల నుంచి బయటకు ప్రశ్నాపత్రాలను పంపించడం దేనికి? దీని వలన ఎవరికి ప్రయోజనం కలుగుతుంది?అనే సందేహాలు కలుగుతాయి. రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల మద్య తీవ్రమైన పోటీ ఉన్నందున ఈ పరీక్షలలో తమ విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు సాధించి పెట్టేందుకు బహుశః అవి ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండవచ్చు. లేదా రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో మాస్ కాపీయింగ్ చేసేందుకు అవకాశమున్న కొన్ని పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు వాటి జవాబులను అందజేయడం కోసం కావచ్చు. కనుక దీనిని పోలీసులే కనుగొనాల్సి ఉంటుంది. 


Related Post