తెలుగు సినిమాలలో తెలంగాణ భాషకి పట్టాభిషేకం... శభాష్

April 01, 2023


img



ఒకపుడు సమైఖ్య రాష్ట్రంలో తెలుగు సినిమాలలో తెలంగాణ భాష, యాసలు కామెడీకి లేదా విలన్ల కోసం వాడుకొనేవారు. తెలంగాణ భాష పట్ల సినీ పెద్దలకు గల చులకనభావమే సినిమాలలో ఆవిదంగా బయటపడేదని చెప్పవచ్చు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ భాష, యస, సంస్కృతీ సంప్రదాయాలు, పల్లెల గురించి చెప్పింది... కనిపించింది  చాలా తక్కువే అని చెప్పవచ్చు. సినీ రంగంలో ఉన్నవారందరూ ఆంద్రాకు చెందినవారై ఉండటమే బహుశః మరో కారణం కావచ్చు. 

కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, సిఎం కేసీఆర్‌ తెలంగాణ భాష, యస, సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలు, పబ్బాలకు అత్యంత ప్రాధాన్యం, గౌరవం ఇస్తుండటంతో తెలుగు సినీ పరిశ్రమ ఆలోచనాధోరణి కూడా మారిందని ఫిదా, దసరా వంటి సినిమాలు నిరూపిస్తున్నాయి. 

అంతేకాదు... తెలుగు సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ కోసం ఇప్పుడు కాస్త తెలంగాణ నేపధ్యాన్ని జోడించడం లేదా తెలంగాణ కధాంశాలతో సినిమాలు తీయడం అవసరమని దర్శక నిర్మాతలు కూడా గ్రహించారు. అందుకే బలగం వంటి మంచి సినిమాలు వస్తున్నాయిప్పుడు. 

అయితే తెలంగాణ కధాంశం లేదా తెలంగాణ నేపధ్యంతో సినిమాలు తీస్తే చాలనే ధోరణి మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణని జోడించేస్తే సినిమాలు హిట్ అవుతాయనే భ్రమలో ఏదో చుట్టబెట్టేస్తుంటే ఫ్లాప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తెలంగాణ నేపధ్యంతో అత్యద్భుతంగా తీసిన బలగం సినిమాలో కూడా విమర్శకులు అనేక తప్పులు ఎత్తిచూపారు. కనుక తెలంగాణతో చుట్టబెట్టేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు కూడా తిరస్కరించే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఇదీ ఓ ట్రెండ్‌లాగా ముగిసిపోతుంది. పాన్ ఇండియా మూవీ అంటే 5 ఇండస్ట్రీల నుంచి ఐదుగురు నటీనటులను పెట్టి చుట్టబెట్టేస్తే ఏమవుతుందో అందరూ చూస్తున్నారు. అదే సరైన కధాబలం ఉంటే ఏవిదంగా ఆదరిస్తారో కార్తికేయ సినిమా నిరూపించి చూపించింది. అదేవిదంగా తెలుగు సినిమాలో తెలంగాణను కాపాడుకోవాలంటే చక్కటి కధాంశాలతో కూడిన సినిమాలు తీయడం చాలా అవసరమని తెలంగాణ దర్శక, నిర్మాతలు, నటీనటులు అందరూ గుర్తించాలి. 

బలగం సినిమాతో తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళగలిగాడు దర్శకుడు వేణు ఎల్దండి. ఈ సినిమాకు లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డులకు ఎంపికైంది. దర్శకుడు వేణు, సినిమాటోగ్రఫర్  ఆచార్య వేణు కలిసి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకోబోతున్నారు.


Related Post