నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్‌, బిజెపిలు ఉమ్మడి పోరాటానికి సై?

April 01, 2023


img

తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై కేసీఆర్‌ ప్రభుత్వంపై ఉమ్మడిపోరాటానికి తమతో కలిసిరావాలంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్‌ చేసి కోరారు. 

రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం తాను చాలాసార్లు దీక్షలు చేశానని కానీ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కదిలించలేకపోయానని చెప్పారు. ఇలా ప్రతిపక్షాలు దేనికవి ఎంతకాలం పోరాడుతున్నా ప్రయోజనం ఉండదని కేసీఆర్‌ని లొంగదీయలేమని, పైగా ఆయనే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేసే ప్రమాదం ఉంటుందని వైఎస్ షర్మిల హెచ్చరించారు. కనుక కేసీఆర్‌ మెడ వంచాలంటే ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని పోరాడవలసి ఉంటుందని వైఎస్ షర్మిల వారికి సూచించారు. 

 కాంగ్రెస్‌, బిజెపిలు రాజకీయంగా శత్రువులైనప్పటికీ వైఎస్ షర్మిల ప్రతిపాదనకు వారిరువురూ సానుకూలంగా స్పందించడం విశేషం. బండి సంజయ్‌ స్పందిస్తూ త్వరలోనే సమావేశమయ్యి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొందామని చెప్పగా, రేవంత్‌ రెడ్డి కూడా సానుకూలంగా స్పందిస్తూనే పార్టీలో చర్చించుకొన్న తర్వాత నిర్ణయం తెలియజేస్తానని చెప్పారు. 

సీనియర్ కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డి రెండు రోజుల క్రితమే అవసరమైతే భవిష్యత్‌లో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేయవలసి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో మతోన్మాద బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు సెక్యులర్ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీతో చేతులు కలపవలసి రావచ్చని అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా భవిష్యత్‌లో బిఆర్ఎస్‌ పార్టీతో కలిసి పనిచేయవలసి రావచ్చని అన్నారు. 

బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు, బిఆర్ఎస్‌ పార్టీతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలు చెపుతున్నప్పుడు, నిరుద్యోగ సమస్యపై బిజెపితో కలిసి కాంగ్రెస్ పార్టీ పనిచేయడం, అదే కేసీఆర్‌ ప్రభుత్వంతో పోరాడాలనుకోవడం చాలా విడ్డూరంగా ఉంటాయి కదా? 


Related Post