ఇదే మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు!

March 31, 2023


img

నిజామాబాద్‌ పసుపు రైతులు వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్‌ తనను గెలిపిస్తే 10 రోజులలోగా కేంద్రంతో మాట్లాడి పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని లిఖితపూర్వకంగా పసుపు రైతులకు హామీ ఇచ్చారు. నాలుగేళ్ళయినా పసుపు బోర్డు ఏర్పాటుకాలేదు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పార్లమెంటులో స్పష్టం చేశారు.

దీంతో జిల్లాలోని పసుపు రైతులు నిజామాబాద్‌లో పలు చోట్ల పసుపు రంగు బోర్డులు ఏర్పాటు చేసి, దానిపై భాగన్న ‘పసుపు బోర్డు’ అని వ్రాసి కిందన ‘ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు,” అంటూ వ్యంగ్యంగా నిరసనలు తెలియజేస్తున్నారు.


ఎంపీగా గెలిచిన తర్వాత 10 రోజులలో జిల్లాకు పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని స్టాంప్ పేపర్ మీద వ్రాసి సంతకం చేసి ఇచ్చారు. కానీ నాలుగేళ్ళుగా తప్పించుకొని తిరుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు పసుపు బోర్డు సాధిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి మాట తప్పిన బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్‌ తమను మోసం చేశారని కనుక వచ్చే ఎన్నికలలో ఆయనకు తగిన విదంగా బుద్ధి చెపుతామని జిల్లా పసుపు రైతులు హెచ్చరిస్తున్నారు. 

మాట నిలబెట్టుకొనేందుకు రైతుల ఆగ్రహానికి గురయితే వచ్చే ఎన్నికలలో గెలవలేనని ధర్మపురి అరవింద్‌కు తెలియదనుకోలేము. కానీ ఆయన వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పట్ల కొంత కాలం క్రితం ఆయన అనుచితంగా మాట్లాడారు. దానిపై ఆమె స్పందిస్తూ “ఈసారి ధర్మపురి అరవింద్‌ నిజామాబాద్‌లోనే కాదు... రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా వెంటపడి ఓడిస్తాను,” అని శపధం చేశారు. కనుక ధర్మపురి అరవింద్‌కు నిజామాబాద్‌లో ఎదురీత తప్పకపోవచ్చు.


Related Post