రాజకీయ లబ్ధి లేకపోతే ప్రజాసమస్యలపై పోరాడవా?

March 29, 2023


img

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన సందేశం పెట్టారు. “ఏప్రిల్ 1వ తేదీ నుంచి 384 అత్యవసరమైన మందులు, వెయ్యికి పైగా ఫార్ములేషన్స్ ధరలు 11% పెరగబోతున్నాయి. టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ ఛార్జీలు కూడా పెరుగబోతున్నాయి. మన రాజకీయపార్టీల గొడవలలో ఇటువంటి ముఖ్యమైన సమస్యలను ఎవరూ పట్టించుకోరు. ఇటువంటి ప్రజాసమస్యల గురించి పోరాడటమే నిజమైన దేశభక్తి, జాతీయవాదమని నేను భావిస్తాను,” అని ట్వీట్‌ చేశారు.

 ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ చెప్పింది అక్షరాల నిజమని అందరికీ తెలుసు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు నీచస్థాయికి దిగజారిపోయాయి. కనుక రాజకీయ పార్టీలకు లేదా వాటి నేతలకు రాజకీయంగా లేదా ఆర్ధికంగా లేదా మరో రూపంలో లబ్ది కలుగుతుందని భావించే అంశాలపైనే పోరాటాలు చేస్తుంటారు. ఉదాహరణకు టిఎస్‌పీఎస్సీ కుంభకోణం గురించి చెప్పుకొంటే, ఇది నిరుద్యోగులపాలిట శాపమే అని చెప్పవచ్చు. లక్షల మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్లు, ఉద్యోగాల కోసం ఏళ్ళ తరబడి సమయం, డబ్బు, శ్రమ అన్నీ పణంగాపెట్టి ఓ రకంగా తపస్సు చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైందనుకొంటే టిఎస్‌పీఎస్సీలో ఈ కుంభకోణం బయటపడింది. దీంతో భర్తీ ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. 

దీంతో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌, బిజెపిలు మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నాయి. ఇది నిరుద్యోగుల ఆవేదనను, ఆగ్రహాన్ని ప్రభుత్వంపైకి, ముఖ్యమంత్రి అవుతారనుకొంటున్న కేటీఆర్‌పైకి మళ్లించే ప్రయత్నంగానే కనిపిస్తోంది. తద్వారా రెండు పార్టీలు బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బ తీసి పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. 

ఈ ఆరోపణలతో బిఆర్ఎస్‌ పార్టీకి రాజకీయంగా నష్టం కలుగుతుంది కనుక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ వారిరువురిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావావేస్తూ నోటీసులు పంపారు. కనుక నిరుద్యోగుల సమస్య కాస్త పక్కదారి పట్టి ఇప్పుడు మూడు పార్టీల మద్య రాజకీయ పోరాటంగా మారిందని అర్దమవుతోంది. 

దేశానికి నష్టం కలిగిస్తున్న ఆదానీ కుంభకోణాలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మోడీ ప్రభుత్వం హడావుడిగా తనపై అనర్హత వేటు వేసిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తుండటం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆదానీ కుంభకోణాలను మరిచి రాహుల్ గాంధీ అనర్హత వేటు వేయడం జాతీయ సమస్య అన్నట్లు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ, అందివచ్చిన ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. 

కనుక రాజకీయ పార్టీలు వాటి నేతలు నిజమైన ప్రజాసమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాడటం మానేసి, తమ రాజకీయ ప్రయోజనాల కోసమే పోరాడుకొంటున్నారని చెప్పవచ్చు. ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ చెపుతున్నారనుకోవచ్చు. 



Related Post