తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సెప్టెంబర్‌లో షెడ్యూల్ జారీ కావచ్చని సిఎం కేసీఆర్ చెప్పారని డోర్నకల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ చెప్పారు. కేసీఆర్ సూచన మేరకు మొన్న డోర్నకల్లో పార్టీ నేతలతో ఆయన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ, “15 రోజుల క్రితం సిఎం కేసీఆర్ మా అందరినీ పిలిపించుకొని సెప్టెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ జారీ కావచ్చని చెప్పారు. రాష్ట్రంలో మన పార్టీ బలపడుతోంది కనుక కేంద్ర ప్రభుత్వం ఇంకా ముందే అంటే ఆగస్ట్ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసినా ఆశ్చర్యం లేదని చెప్పారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది కనుక ఆలోగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసుకోవాలని సిఎం కేసీఆర్ చెప్పారు. పార్టీలో నేతల మద్య, నేతలకు కార్యకర్తలకు మద్య, నేతలకు ప్రజలకు మద్య అభిప్రాయబేధాలు ఉండవచ్చు. అలాగే పార్టీలో కొందరు అసంతృప్తిగా ఉండవచ్చు. కనుక ఎక్కడిక్కడ ఇలా ఆత్మీయసమ్మేళనాలు పెట్టుకొని నలుగురూ కూర్చొని భోజనాలు చేసి సమస్యలు, విభేధాలు ఏవైనా ఉంటే పరిష్కరించుకోవాలని సిఎం కేసీఆర్ చెప్పారు. కనుక ఇక నుంచి వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొందాము,” అని చెప్పారు.
టిఆర్ఎస్ పార్టీ 2018 డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లింది కనుక ఆ ప్రకారం 2-3 నెలల ముందుగా అంటే అక్టోబర్ నవంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ సిఎం కేసీఆర్ సెప్టెంబర్‌లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకవచ్చని చెప్పారంటే అది నిజమే అయ్యుండవచ్చు. ఎందుకంటే, ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల షెడ్యూల్స్ కేసీఆర్ ఎప్పుడు విడుదలవుతాయని చెప్పారో అదే సమయంలో విడుదలయ్యాయి. కనుక సెప్టెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ అంటే కేవలం 6 నెలల సమయం మాత్రమే ఉంది. కనుక ఎన్నికలు దగ్గర పడిన్నట్లే లెక్క.