దేశంలో అత్యంత జనాధారణ పొందిన మెట్రోలలో హైదరాబాద్ ఒకటి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విస్తరణ పట్ల వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ కంటే తక్కువ జనాభా ఉన్న యూపీలోని చిన్న పట్టణాలైన లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగ్ రాజ్, మీరట్, ఆగ్రాలకు కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టులు కేటాయించింది. అదేవిదంగా బెంగళూరు, చెన్నై, (గుజరాత్), కొచ్చి (కేరళ) వంటి పెద్ద నగరాలకు మెట్రో ప్రాజెక్టులు కేటాయించింది. కానీ హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు నిధులు కేటాయించడం లేదు?అని ప్రశిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హారదీప్ సింగ్ పూరికి ఓ లేఖ వ్రాశారు.
గతంలో హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులకు సంబందించి పూర్తి వివరాలను పంపించినా అందలేదని చెప్పినందున మళ్ళీ మరోసారి ఈ లేఖతో జత చేసి పంపిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అవసరమైతే ఢిల్లీ వచ్చి వివరించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పినా కేంద్రమంత్రి సందించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులకు ఆమోదం తెలిపి అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ లేఖలో కోరారు.
కారణాలు ఏవైతేనేమి, సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీతో కేంద్ర ప్రభుత్వంతో గొడవపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించుతామని చెప్పి ఆ దిశలో ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ప్రధాని నరేంద్రమోడీని అసమర్దుడు, అవివేకి, అహంకారి అంటూ వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఆయనకు స్వాగతం పలికి, అధికార కార్యక్రమాలలో పాల్గొని మళ్ళీ తిరిగి వెళుతున్నప్పుడు వీడ్కోలు పలకాలి. కానీ ప్రధాని నరేంద్రమోడీకి కనీసం స్వాగతం పలకకపోగా ఆయన వచ్చిన ప్రతీసారి నగరంలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ భారీ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టిస్తున్నారు.
ప్రధాని పట్ల ఇంత అనుచితంగా వ్యవహరిస్తున్నప్పుడు కేంద్రం నుంచి సహాయసహకారాలు ఎలా వస్తాయి?బిఆర్ఎస్, బిజెపిల మద్య రాజకీయ వైరం ఉన్నట్లయితే రాష్ట్ర స్థాయిలో తేల్చుకోవాలి. కానీ మద్యలో కేంద్రంతో గొడవపెట్టుకోవడం వలననే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నట్లు అర్దమవుతోంది. కనుక ఈ విషయంలో కేంద్రంది ఎంత తప్పు ఉందో బిఆర్ఎస్ పార్టీది అంతే తప్పు ఉందని చెప్పక తప్పదు. కేంద్రం సహకరించకపోయినా సొంత నిధులతో హైదరాబాద్ మెట్రోని విస్తరించుకొంటామని చెప్పి, భూమిపూజ చేసుకొని, బడ్జెట్‌లో నిధులు కేటాయించుకొని మళ్ళీ కేంద్రం సహాయం చేయడం లేదని నిందించడం దేనికి?