తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంగళవారం మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేయబోతున్నట్లు లీగల్ నోటీసులు పంపారు. టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ దురుదేశ్యంతోనే మీరు పదేపదే నా పేరును ప్రస్తావిస్తూ నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నంత మాత్రాన్న ఎదుటవారిపై నోటికి వచ్చిన్నట్లు ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ ఉండదు. కనుక మీ అసత్య ఆరోపణలతో నా పరువుకు భంగం కలిగించినందుకు ఐపిసీ సెక్షన్స్ 499,500 ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు మీకు పంపిస్తున్నాను. ఈ నోటీస్ అందిన వారం రోజులలోగా మీ ఆరోపణలు అబద్దమని ఒప్పుకొని వెనక్కు తీసుకొని, బేషరతుగా బహిరంగంగా నాకు క్షమాపణలు తెలియజేయాలి లేకుంటే రూ.100 కోట్లకు పరువు నష్టం దావాను కోర్టులో ఎదుర్కోగలరు,” అని నోటీసులో పేర్కొన్నారు.
అయితే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇటువంటి న్యాయ సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్దపడే మంత్రి కేటీఆర్‌పై ఇంత తీవ్ర ఆరోపణలు చేసి ఉండవచ్చు. బహుశః ఇదే విషయం వారు నేడో రేపో ప్రకటించవచ్చు. ఈ కేసుకు భయపడి మంత్రి కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేశామని వారు అంగీకరిస్తే వారి రాజకీయ జీవితం సమాప్తం అవుతుంది. కనుక వారిద్దరూ ఈ కేసును తప్పనిసరిగా ఎదుర్కోవలసి ఉంటుంది.