హైదరాబాద్‌లో 200 పడకల హాస్పిటల్‌కు శంకుస్థాపన

March 28, 2023


img

ఒకప్పుడు, అంటే... సమైక్య రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు దేనికైనా శంకుస్థాపన చేశారంటే, ఆ పనులు ఎప్పుడు మొదలుపెడతారో ఎప్పుడు పూర్తవుతాయో వారు కూడా చెప్పలేని పరిస్థితులు ఉండేవి. కనుక రాష్ట్ర వ్యాప్తంగా వాటి శిలాఫలకాలు మాత్రం కనిపిస్తుండేవి. కానీ తెలంగాణ ఏర్పడి బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పనికైనా శంకుస్థాపన చేశారంటే, అది యుద్ధప్రాతిపదికన నిర్మించి చూపుతోంది. 

ఈ 8 ఏళ్ళలో ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే ప్రభుత్వం ఎన్ని ఫ్లైఓవర్‌లు నిర్మించిందో అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రగతి భవన్‌, సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్పిటల్స్, వైద్య కళాశాలలు, ట్యాంక్‌బండ్‌లు, కేబిల్ బ్రిడ్జిలు, సమీకృత కలెక్టర్ కార్యాలయాలు, సమీకృత మార్కెట్లు, పార్కులు, వైకుంఠధామాలు ఇలా చెప్పుకొంటూపోతే ఆ జాబితాకు అంతే ఉండదు. కనుకనే ప్రజలకు కూడా ఇప్పుడు శంకుస్థాపనలను నమ్ముతున్నారు. 

ఈరోజు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి హైదరాబాద్‌, నీమ్స్ హాస్పిటల్‌ పరిధిలో ఎర్రమంజిల్ వద్ద 200 పడకల మాతా-శిశు హాస్పిటల్‌కు శంకుస్థాపన చేశారు. రూ.55 కోట్లతో అత్యాధునిక సాంకేతిక, వైద్య సదుపాయాలతో దీనిని నిర్మించబోతున్నామని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. దీని నిర్మాణ పనులు ఏడాదిన్నరలోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. 

హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అత్యాధునిక వైద్య చికిత్సలు ఆందించే పలు ప్రఖ్యాత హాస్పిటల్స్ ఏర్పాటవడంతో గల్ఫ్, ఆఫ్రికా దేశాల నుంచి కూడా ఏటా వేలమంది రోగులు వచ్చి చికిత్సలు చేయించుకొంటున్నారు. దీంతో పర్యాటక ఆరోగ్య కేంద్రంగా హైదరాబాద్‌ మారిందని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తాజా నివేదికలో పేర్కొంది.


Related Post