కల్వకుంట్ల కవితకు ఈడీ లేఖ.. విచారణకు కాదు!

March 28, 2023


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఓ లేఖ వ్రాసింది. అయితే మళ్ళీ విచారణకు రమ్మనమని పిలిచేందుకు కాదు. ఆమె అప్పగించిన 10 మొబైల్ ఫోన్లను తెరిచి వాటిలో నిక్షిప్తమైన డాటాను రికవరీ చేయబోతున్నామని కనుక స్వయంగా ఆమె గానీ లేదా ప్రతినిధిని కానీ పంపాలని లేఖలో కోరింది. బిఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఆమె తరపున ఈడీ కార్యాలయానికి హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేదని, రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే ఈడీ దురుదేశ్యపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించిందని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు దొరకాకుండా చేసేందుకు తాను 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడాన్ని ఆమె తప్పు పట్టారు. ఈ నెల 20వ తేదీన ఆమె ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైనప్పుడు తాను ధ్వంసం చేశానని ఈడీ చెప్పిన 10 మొబైల్ ఫోన్లను తీసుకువెళ్ళి ఆమె ఈడీ అధికారులకు అప్పగించారు. వాటినే ఈడీ ఇప్పుడు తెరిచి వాటిలో డాటాను రికవరీ చేయబోతోంది. 

ఒకవేళ ఈడీ ఆరోపిస్తున్నట్లు ఈ లిక్కర్ స్కామ్‌లో సాక్ష్యాధారాలు దొరక్కుండా ఆమె వాడిన మొబైల్ ఫోన్లను ధ్వంసం చేయడం నిజమైతే, మరి ఆమె ఈడీకి అందజేసిన ఈ 10 ఫోన్లు ఎవరివి?ఒకవేళ అవి ఆమె వాడిన ఫోన్లు కాకపోతే వాటిని ఈడీ పరిశీలించి ఏం ప్రయోజనం?ఒకవేళ ఆమెకు నిజంగానే ఈ కేసుతో సంబందం ఉన్నట్లయితే, వాటిని ఆమె ఈడీకి అప్పగించరు కదా?ఒకవేళ అప్పగించినా దానిలో డాటాని డిలీట్ చేయకుండా యధాతధంగా అప్పగిస్తారని ఈడీ అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?

వాటిలో కల్వకుంట్ల కవితని దోషి అని నిరూపించే ఏ డాటా (ఆధారం) దొరకదు కనుక అప్పుడు ఈడీయే కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఇవ్వవలసి రావచ్చు. అదే కనుక జరిగితే, దర్యాప్తు సంస్థలపై బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు నిజమని ధృవీకరించిన్నట్లవుతుంది. కనుక బహుశః ఇది ఈడీ కోసం బిఆర్ఎస్ వేసిన ఉచ్చు కావచ్చు.


Related Post