టిఎస్‌పీఎస్సీ స్కామ్‌... ఇంకెంతమందిని అరెస్ట్ చేయాలో?

March 28, 2023


img

తీగలాగితే డొంక కదిలిందన్నట్లు టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతున్నకొద్దీ రోజుకో కొత్తపేరు వినిపిస్తూనే ఉంది. టిఎస్‌పీఎస్సీలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులే ఈ స్కామ్‌కు పాల్పడ్డారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కానీ ఇప్పటి వరకు పోలీసులు 15మందిని అరెస్ట్ చేశారు. నిందితులను కస్టడీలో తీసుకొని ప్రశ్నిస్తున్నకొద్దీ ఇంకా చాలా మంది పేర్లు బయటపడుతూనే ఉన్నాయి. 

ఈ కేసులో ప్రధాన నింధితులు ప్రవీణ్, రాజశేఖర్ కాగా, రేణుక అనే మహిళ ప్రవీణ్‌కు పది లక్షలు చెల్లించి ప్రశ్నాపత్రాలను తీసుకొని తన బంధువులు నీలేష్, గోపాల్ అనే ఇద్దరికి అమ్మిన్నట్లు పోలీసులు గుర్తించారు. రేణుకకు తెలియకుండా ఆమె భర్త డాక్యా ఏఈ ప్రశ్నాపత్రాలను తిరుపతయ్య అనే మధ్యవర్తి ద్వారా ప్రశాంత్ రెడ్డి, రాజేంద్ర కుమార్‌ అనే మరో ఇద్దరికి అమ్మిన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

ప్రశాంత్ అనే యువకుడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వ్రాసేందుకు న్యూజిలాండ్ నుంచి వచ్చాడు. అతను ప్రధాన నిందితుడు రాజశేఖర్‌కి దగ్గర బంధువు కావడంతో పోలీసులు అతనిని విచారణకు హాజరుకావలసిందిగా వాట్సప్ ద్వారా నోటీస్ పంపారు.   

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 53 మంది అభ్యర్ధులను కూడా గుర్తించి వారందరినీ కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎక్కువ మార్కులు సాధించారనే కారణంతో వారిని దోషులుగా నిర్ధారించడం సరికాదు కనుక నిపుణులతో మరో ప్రశ్నాపత్రం తయారు చేయించి వారందరికీ పరీక్ష పెట్టబోతున్నారు.

టిఎస్‌పీఎస్సీ స్కామ్‌లో ఇంతమంది పేర్లు బయటపడుతుండటం చూస్తే, ఇంకెంతమందికి ప్రశ్నాపత్రాలు చేరాయో?అనే సందేహం కలుగకమానదు. ఎందుకంటే, ఇప్పుడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్ వంటి సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి కనుక ప్రశ్నాపత్రాలను ఎంతమందికైనా చేరవేయడం చాలా సులువు. 

తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థలలో టిఎస్‌పీఎస్సీని ఒకటిగా భావిస్తుంటే, దాని వలననే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట మంటగలవడం చాలా బాధాకరమే.


Related Post