కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హతవేటు వేసిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు మరో షాక్ ఇచ్చింది. ఈ నెల 23వ తేదీన అనర్హత వేటు పడినందున, నిబందనల ప్రకారం తుగ్లక్ రోడ్డులోని అధికార నివాసాన్ని ఖాళీ చేయవలసిందిగా రాహుల్ గాంధీకి లోక్‌సభ సెక్రెటరీయెట్ నోటీస్ పంపింది.
కుంటిసాకుతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినందుకే యావత్ దేశంలో కాంగ్రెస్ శ్రేణులు రగిలిపోతూ ఎక్కడిక్కడ ఆందోళనలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే తెలంగాణ సిఎం కేసీఆర్‌తో సహా రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా అనేక ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు ఇస్తున్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా పార్లమెంటులో విపక్షాలు ఏకమయ్యి పోరాడుతున్నాయి. మోడీ ప్రభుత్వం తొందరపాటుతో తీసుకొన్న నిర్ణయంపై పునరాలోచన చేసి దానిని ఉపసంహరించుకొని ఉంటే హుందాగా ఉండేది. కానీ రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయాలని కోరుతూ నోటీస్ పంపడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. మోడీ ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినప్పటికీ, దాని వలన ఆశించిన ప్రయోజనం లభిస్తుందో లేదో తెలీదు కానీ దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న రాజకీయ శక్తులన్నీ ఒక్క తాటిపైకి వచ్చేందుకు ఎంతగానో తోడ్పడుతోంది. అంతేకాదు... భారత్ జోడో పేరుతో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేసినప్పుడు కూడా రాని ప్రచారం, మద్దతు, సానుభూతి, రాజకీయ ప్రయోజనాలను మోడీ ప్రభుత్వం తీసుకొన్న ఈ ఒక్క నిర్ణయంతో లభిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అనూహ్యంగా లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని దేశంలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాల మద్దతు కూడగట్టుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కనుక కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి రాహుల్ గాంధీ థాంక్స్ చెప్పుకోవలసిందే.