రెండేళ్ళలో తెలంగాణలో పెట్టుబడులు 150% వృద్ధి

March 25, 2023


img

తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండేళ్ళలో పెట్టుబడులు 150% వృద్ధి చెందాయని, వాటితో 7 లక్షల ఐ‌టి ఉద్యోగాలు వచ్చాయని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది. 2020-2021లో రాష్ట్రానికి రూ.31,274 కోట్లు పెట్టుబడులు రాగా, 2021-2022లో రూ.76,568 కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఛైర్మన్ డిఎస్. రావత్ గురువారం వెల్లడించారు. ఈ తాజా పెట్టుబడుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 60,000 ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. 

దేశంలో అన్ని రాష్ట్రాలు కరోనా మహమ్మారితో అల్లాడుతున్న సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రం 2.2% వృద్ధిరేటు సాధించిందని పేర్కొంది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, వ్యవసాయ అనుబంద రంగాలను బలోపేతం చేయడమేనని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది. 

ఇక 2014-15లో తెలంగాణ ఐ‌టి ఎగుమతుల విలువ రూ.66,276 కోట్లు కాగా, అవి 2021-2022లో ఏకంగా రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. దీని వలన తెలంగాణలో ఐ‌టి తదితర రంగాలలో ఉద్యోగాలు 3.71 లక్షల నుంచి ఒకేసారి 7 లక్షలకు పెరిగాయని పేర్కొంది. కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీటవేస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ రంగాలలో కూడా తెలంగాణ అగ్రగామిగా నిలువబోతోందని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది.

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య పర్యాటక రంగాన్ని కూడా సకాలంలో గుర్తించి చురుకుగా నిర్ణయాలు తీసుకొనందున, గల్ఫ్, ఆఫ్రికా దేశాల నుంచి దాదాపు 2 లక్షల మంది వచ్చి హైదరాబాద్‌లో చికిత్సలు చేయించుకొన్నారని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది. తద్వారా ఆరోగ్య పర్యాటక రంగం ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరిందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నందున భవిష్యత్‌లో ఈ ఆరోగ్య పర్యాటక రంగం ద్వారా తెలంగాణ ఆదాయం మరింత బారీగా పెరగనుందని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది. 


Related Post