రాహుల్ గాంధీపై అనర్హత వేటు... కాంగ్రెస్‌కు దిక్కెవరు?

March 24, 2023


img

కాంగ్రెస్‌ పార్టీకి మోడీ ప్రభుత్వం ఈరోజు ఊహించని పెద్ద షాక్ ఇచ్చింది. సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ళు జైలు శిక్ష విధించడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రెటరీ జనరల్ ఉత్తమ్ కుమార్‌ సింగ్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ చట్టంలోని సెక్షన్ 102 (1) (ఈ) ప్రకారం పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా ఏదైనా కేసులో కనీసం రెండేళ్ళు ఆపైన జైలుశిక్ష పడిన్నట్లయితే పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హులవుతారు. సభ్యత్వం కోల్పోతారు. కేరళలోని వాయ్‌నాడ్ నుంచి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ నేటి నుంచి లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు.

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ కర్ణాటక రాష్ట్రంలో కోలార్ నియోజకవర్గంలో ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ, “నీరవ్ మోడీ, లలిత్ మోడీ... ఇలా దేశంలో దొంగలపేర్లన్నీ మోడీతోనే ఉంటాయెందుకు?అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశ్యించే ఆ వ్యాఖ్యలు చేశారని వేరే చెప్పక్కరలేదు. 

దీనిపై గుజరాత్‌ బిజెపి ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ, సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దానిపై నాలుగేళ్ల విచారణ అనంతరం గురువారం తుది తీర్పు చెపుతూ రాహుల్ గాంధీకి రెండేళ్ళు జైలుశిక్ష విధించింది. తీర్పు వెలువడిన 24 గంటలలోపే లోక్‌సభ సెక్రెటరీయెట్ వెంటనే రాహుల్ గాంధీని సంజాయిషీ కూడా కొరకుండా అనర్హత వేటు వేసింది. 

కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మల్లిఖార్జున ఖర్గే చేపట్టినప్పటికీ పార్టీలో అందరూ రాహుల్ గాంధీనే తమ అధినేతగా భావిస్తుంటారని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ వంకతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేని పరిస్థితి కల్పించిన్నట్లయింది. ఈ కారణంగా రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికలలో పోటీ చేయలేకపోతే, ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవచ్చు. కనుక తన జైలు శిక్ష, అనర్హత వేటుపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయకతప్పదు. 


Related Post