ఇవిగో నా పాత ఫోన్లు... ఏం చేసుకొంటారో చేసుకోండి!

March 21, 2023


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయం 11.30 గంటలకు మరోసారి ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని తన తండ్రి కేసీఆర్‌ నివాసం నుంచి కారులో బయలుదేరుతూ రెండు ప్లాస్టిక్ కవర్లలో స్టిక్కర్స్ అంటించి భద్రపరిచిన తన పాత 10 మొబైల్ ఫోన్లను మీడియా ప్రతినిధులకు ప్రదర్శించి చూపారు. మళ్ళీ ఈడీ కార్యాలయంలో ప్రవేశించే ముందు మరోసారి వాటిని అందరికీ చూపించారు. 

ఈ లిక్కర్ స్కామ్‌పై విచారణ జరుపుతున్న సీబీఐ, ఈడీలు ఈ కేసులో సాక్ష్యాధారాలను ఎవరికీ దొరకాకుండా తుడిచిపెట్టేసేందుకు కల్వకుంట్ల కవిత గత నాలుగేళ్ళలో 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఆరోపించింది. కానీ అవన్నీ భద్రంగానే ఉన్నాయని కావాలనుకొంటే ఈడీ, సీబీఐలకు అందజేస్తానని కల్వకుంట్ల కవిత చెపుతున్నారు. నిన్న విచారణలో బహుశః ఈ విషయం ప్రస్తావించి వాటిని అప్పగించవలసిందిగా ఈడీ అధికారులు కోరి ఉండవచ్చు. వాటినే ఆమె అప్పగిస్తూ, తనను విచారిస్తున్న ఈడీ అధికారి జోగేందర్‌కు ఓ లేఖ కూడా వ్రాశారు. 

“ ఈ కేసులో మీరు నాకు ఈ ఏడాది మార్చిలో తొలిసారిగా నోటీస్ పంపారు. కానీ 5 నెలల ముందుగానే అంటే 2022, నవంబర్‌లో నేను 10 ఫోన్లని ధ్వంసం చేశానని ఆరోపించారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఈవిదంగా తప్పుడు ఆరోపణలు చేయడం, వాటిని మీడియాకు లీక్ చేయడం దురుద్దేశ్యంతో చేసిన్నట్లుగానే భావిస్తున్నాను. మీరు చేసిన ఈ తప్పుడు ఆరోపణలతో తెలంగాణ రాష్ట్రంలో మా రాజకీయ ప్రత్యర్ధులు వ్యక్తిగతంగా, రాజకీయంగా నాపైన, మా ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తూ మా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. ఈడీ నా పట్ల దురుదేశ్యంతో వ్యవహరిస్తున్నప్పటికీ నేను నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, నేను ధ్వంసం చేశానని చెపుతున్న నేను వాడిన పది ఫోన్లను మీకు అప్పగిస్తున్నాను. ఓ మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం ఆమె గోప్యతకు భంగం కలిగించడం కాదా?ఈడీ ఈవిదంగా ఓ మహిళ పట్ల దురుదేశ్యపూర్వకంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరం,” అని కల్వకుంట్ల కవిత లేఖలో పేర్కొన్నారు. 

కల్వకుంట్ల కవిత వాడిన పాత పది ఫోన్లను నేడు అందరికీ చూపించి ఈడీకి అప్పగించడం ద్వారా తనపై ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని దురుదేశ్యపూర్వకంగా వ్యవహరిస్తోందని బలమైన సంకేతాన్ని తెలంగాణ ప్రజలకు పంపిన్నట్లయింది. వాటన్నిటినీ ఈడీకి అప్పగిస్తున్నందున, ఇప్పుడు ఈడీ తన ఆరోపణలను నిరూపించుకోక తప్పని పరిస్థితి కల్పించారు కూడా. మరి వీటిపై ఈడీ ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.


Related Post