బిడ్డకి కష్టం... పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ లేఖ!

March 21, 2023


img

సిఎం కేసీఆర్‌ అకస్మాత్తుగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆత్మీయ సందేశం పంపడం ఆశ్చర్యకరమే. ఇంతకీ ఆయన సందేశం సారాంశం ఏమిటంటే, “అనేక కష్టాలు, కన్నీళ్ళకు ఓర్చి త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకొన్నాము. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొన్నాము. తెలంగాణ స్పూర్తితో దేశాన్ని కూడా అభివృద్ధి చేసుకొందామనుకొంటే బిజెపి ఈడీ, సీబీఐ, ఐ‌టిలను ఉసిగొల్పి దాడులు చేయిస్తోంది. కానీ మన పోరాటం ఆగదు. ఈ పోరాటంలో నాతో కలిసి నడుస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు.”

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆరోపణలు ఎదుర్కొంటూ నిన్న, ఈరోజు ఈడీ విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ అధికారులు ఆమెను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చని కేసీఆర్‌తో సహా అందరూ ఆందోళన చెందుతుండటం సహజమే. కనుక ఈ కష్టకాలంలో బిఆర్ఎస్ శ్రేణులన్నీ తనకు అండగా నిలబడాలని కేసీఆర్‌ కోరుకోవడం కూడా సహజమే. బహుశః అందుకే అకస్మాత్తుగా ఈ సందేశం పంపి ఉండవచ్చు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత కీలకపాత్ర పోషించారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తుండగా, అసలు అదేమిటో తనకు తెలియదని, కేంద్ర ప్రభుత్వం తన తండ్రిని లొంగదీసుకొనేందుకే, ఈ కేసు పేరుతో వేధిస్తోందని ఆమె వాదిస్తున్నారు. ఇవి రాజకీయ వేధింపులా కాదా?ఈ కేసులో నిజానిజాలు ఏమిటో మున్ముందు తెలుస్తాయి. అంతవరకు బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు దేని వాదనలు అవి వినిపిస్తూనే ఉంటాయి. 


Related Post