అంటే లిక్కర్ స్కామ్ జరిగిందని శ్రీనివాస్ గౌడ్ ధృవీకరిస్తున్నట్లేగా?

March 20, 2023


img

 ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆమెతో పాటు భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆమె న్యాయవాది సోమ భరత్‌ ఈడీ కార్యాలయం వరకు వచ్చారు. కానీ భద్రతా సిబ్బంది ఆమె న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడంతో ఆమె ఒక్కరే ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలోనికి వెళ్లారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ “ఈ లిక్కర్ స్కామ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల వారు ఉంటే ఉండొచ్చు కానీ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఆదానీ తదితరులు లక్షల కోట్లు దోచుకుపోతే వారిని పట్టుకొని విచారించకుండా ఈ లిక్కర్ స్కామ్‌లో 10 కోట్లు పోయినయ్... 100 కోట్లు పోయినయ్ అంటూ ఈ వేధింపులు ఏమిటి? ఈ చిల్లర స్కామ్‌ పేరుతో తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట్ల కవితని వేధిస్తున్నారు. మోడీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిపై ఈవిదంగా కేసులు బనాయించి వేధిస్తుంటారు. అదే బిజెపిలో చేరిపోతే వారిపై ఉన్న అన్ని కేసులు మాఫీ అయిపోతాయి. మేము బిజెపికి లొంగలేదనే కదా ఈ చిల్లర స్కామ్‌లో మా ఆడబిడ్డని ఇరికించి ఇబ్బంది పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశం గురించి ఆలోచించాలి... పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పించడం గురించి ఆలోచించాలి. కానీ ఈవిదంగా ప్రశ్నించినవారిని వేదిస్తూ అందరినీ లొంగదీసుకోవాలని ప్రయత్నించడం సరికాదు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా మేము భావిస్తున్నాము,” అని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. 

తద్వారా ఈ లిక్కర్ స్కామ్‌ జరిగిందని దానిలో కల్వకుంట్ల కవిత ప్రమేయం కూడా ఉందని ధృవీకరించిన్నట్లయింది స్వయంగా ధృవీకరించిన్నట్లయింది కదా? కానీ ఇది చాలా చిన్న స్కామ్ కనుక కల్వకుంట్ల కవితని వేధించడం సరికాదన్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ చెపుతున్నట్లుంది. 

బిఆర్ఎస్ నేతల వాదనలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల స్పందిస్తూ, “ఈడీ, సీబీఐ, ఐ‌టి తదితర దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తుంటాయి. వాటి వ్యవహారాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఒకవేళ కల్వకుంట్ల కవిత లేదా మరెవరైనా సరే తాము నిర్ధోషులమని భావిస్తున్నట్లయితే, దర్యాప్తు సంస్థలపై కోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉంది కదా?నిర్ధోషులైతే దర్యాప్తు సంస్థల విచారణకు ఎందుకు భయపడుతున్నారని అమిత్‌ షా ప్రశ్నించారు. 

తాము రాజ్యాంగంపై గౌరవంతోనే విచారణకు హాజరవుతున్నాము తప్ప మోడీ, ఈడీ, సీబీఐలకు భయపడికాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ చెప్పారు.
Related Post