టిఎస్‌పీఎస్సీ లీకేజీలో మరో కోణం?

March 20, 2023


img

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై రేవంత్‌ రెడ్డి ఓ కోణంలో సంచలన ఆరోపణలు చేయగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ మరో కోణంలో సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్‌ నేతల పిల్లలకు ఉద్యోగాలు దక్కేలా చేసేందుకు జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది. జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో మొత్తం 50 మంది గ్రూప్-1కి అర్హత సాధించగా వారిలో ఒకే ఆరుగురు అభ్యర్ధులున్నారు. వారందరూ బిఆర్ఎస్‌ నేతల కొడుకులు లేదా బిఆర్ఎస్‌ నేతల దగ్గర పనిచేస్తున్నవారి బంధువుల పిల్లలే. నలుగురు సర్పంచ్‌ల కుమారులు, సింగిల్ విండో ఛైర్మన్‌ కుమారుడు, జెడ్పీటీసీ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు, ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు ఈ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. వారిలో ఓ సర్పంచ్‌ కుమారుడు ఈ పరీక్షలో అర్హత సాధించలేకపోయినా క్వాలిఫై చేశారు. 

ఇదంతా మంత్రి కేటీఆర్‌ కనుసన్నలలోనే జరిగింది. ఒక్కో అభ్యర్ధి దగ్గర రూ.3-5 లక్షల వరకు వసూలు చేసి ప్రశ్నాపత్రాలను అందించిన్నట్లు మా వద్ద పక్కా సమాచారం ఉంది. బిఆర్ఎస్‌ నేతల పిల్లల కోసం ఈ పరీక్షలు వ్రాసిన అభ్యర్ధుల జీవితాలతో మంత్రి కేటీఆర్‌ చెలగాటం ఆడారు. కనుక సిఎం కేసీఆర్‌ తన కుమారుడు మంత్రి కేటీఆర్‌ను తక్షణం మంత్రిపదవి నుంచి బర్త్ రాష్ట్ర ప్రభుత్వం చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము డిమాండ్‌ చేస్తున్నాము. 

ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో సిట్‌ ఏర్పాటు చేసి టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు, నయీమ్ కేసులాగా దీనినీ కప్పిపుచ్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సిట్ విచారణకు మేము అంగీకరించము. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెనుక ఎవరెవరున్నారో బయటపడుతుంది,” అని అన్నారు. 

మంత్రి కేటీఆర్‌ పీఏ తిరుపతి, రాజశేఖర్ కలిసి ప్రశ్నాపత్రాలు అమ్ముకొన్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించగా, బిఆర్ఎస్‌ నేతలు లేదా బిఆర్ఎస్‌తో సంబంధాలున్నవారికి పేపర్లు అందేలా చేశారని బండి సంజయ్‌ ఆరోపించారు. వారిద్దరూ ప్రభుత్వంపై చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. కనుక వాటిని నిరూపించవలసిన బాధ్యత వారిపై ఉంది. లేకుంటే కేవలం బిఆర్ఎస్‌ని దెబ్బతీయాడానికే ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం, దీనిపి ఇటువంటి ఆరోపణలు లక్షల మంది నిరుద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతాయి కనుక హైకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటు కేసుగా స్వీకరించి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. 


Related Post