ప్రధాని నరేంద్రమోడీ లేదా కేంద్రమంత్రులు ఎవరైనా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి ఎదురేగి స్వాగతించే రోజులు ఎప్పుడో పోయాయి. వారు రాష్ట్రానికి వస్తున్న ప్రతీసారి వారిని విమర్శిస్తూ లేదా ఎద్దేవా చేస్తూ హైదరాబాద్ నగరంలో పోస్టర్లు పెట్టడం సరికొత్త ట్రెండ్ నడుస్తోందిప్పుడు. బిఆర్ఎస్ లేదా దాని మద్దతుదారులు పోస్టర్లు పెడుతున్నప్పుడు ఆ పార్టీని వ్యతిరేకించేవారికి కూడా ఆ అవకాశం ఉంటుంది. కనుక బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోటోతో “తెలంగాణను తలదించుకొనేలా చేసినవ్...” అనే క్యాప్షన్‌తో ఈరోజు నగరంలో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి.
నగర పోలీసులు వెంటనే వాటన్నిటినీ తొలగించి, సిసి కెమెరా రికార్డింగ్ ఆధారంగా వాటిని ఎవరు పెట్టారో కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వారిని సులువుగానే పట్టుకొని వారిపై కేసు నమోదు చేయగలరు.
అయితే ఈ పోస్టర్స్ యుద్ధం మొదట ప్రారంభించింది బిఆర్ఎస్ పార్టీయే. అదీ దేశ ప్రధానిని అవమానిస్తూ పోస్టర్లు వెలుస్తున్నాయి. కనుక వాటిని ఏర్పాటు చేస్తున్నవారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఉండాలి కదా?ఒకవేళ ప్రధాని నరేంద్రమోడీని అవహేళన చేస్తూ పోస్టర్స్ పెట్టడం తప్పు కాదనుకొంటే ఇదీ తప్పు కాదు కదా?
రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్నపార్టీలు... ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, నైతిక విలువలకు కట్టుబడి ఉంటే ఇటువంటి సమస్యలు రావు. కానీ తాము ఏమి చేసినా చెల్లుతుందనే ధైర్యంతో అధికార పార్టీలు ఓ మెట్టు దిగితే ప్రతిపక్షాలు రెండు మెట్లు దిగుతాయి. అప్పుడు అవమానపడేది అధికార పార్టీలే. అందుకు ఈ తాజా పోస్టరే నిదర్శనంగా భావించవచ్చు. కనుక ఇకనైనా బిఆర్ఎస్ పార్టీ ఈ పోస్టర్స్ యుద్ధం నిలిపివేస్తే అందరికీ మంచిది. అప్పుడు ప్రతిపక్షాలు తప్పు చేస్తే చట్టప్రకారం శిక్షించినా ఎవరూ వేలెత్తి చూపరు.